చిరంజీవి - బాలకృష్ణ... 100 రోజుల చిచ్చు!
తెలుగులో అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణతో మైత్రీ మూవీ మేకర్స్ ఒకేసారి రెండు సినిమాలను నిర్మించింది. ఇద్దరు హీరోల అభిమానులను ఈ రెండు సినిమాలతో నిర్మాణ సంస్థ మెప్పించింది. చాలా నేర్పుగా వ్యవహరించి చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల అంచనాలను అందుకుంది. ప్రమోషన్ల విషయంలో కూడా బ్యాలెన్స్ చేశారు. సక్సెస్ మీట్లు కూడా రెండు పెట్టారు. ఇద్దరు హీరోల కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ అని మైత్రీ మూవీస్ ప్రకటించింది.
జూన్ 10వ తేదీ బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో మైత్రీ మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి 100 రోజుల పండగ చేశారు. టీమ్ మొత్తానికి శతదినోత్సవ షీల్డ్ లు అందజేశారు. డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇచ్చారు. వీరసింహారెడ్డి వీర మాస్ బ్లాక్ బస్టర్ అని ప్రకటించారు. ఇప్పుడు నిర్మాతలు చేసిన ఈ పనే చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య వివాదం రాజేసింది. వాల్తేరు వీరయ్యకు 100 రోజులు వేడుక లేదా? అని మెగా అభిమానులు మైత్రీ నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు.

100 రోజులైపోయి చాలారోజులైందికదా.. ఇప్పుడు ఈ హడావిడి ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే నిర్మాతల సామాజికవర్గాన్ని ముడిపెడుతూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఈ సినిమా శతదినోత్సవం చేస్తామని మైత్రీ ప్రకటించింది. ఆ సమయంలో ఐటీ దాడులు జరగడంతో వేడుక జరగలేదు. తాజాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీంతో వందరోజుల వీరసింహారెడ్డి అంటూ బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇది చూసిన చిరంజీవి అభిమానులకు ఎక్కడో వెలితిగా అనిపిస్తోంది. రెండు సినిమాలు సమానంగా విజయం సాధించాయని నిర్మాతలు చెప్పారని, కానీ ఒక్క సినిమాకే వంద రోజుల వేడుక ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లో చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. చిరంజీవి అభిమానులను సంతృప్తి పరచడానికి నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications