నిమ్మకూరులో జగన్ ప్రకటన: అంతా వట్టిదే... మీడియా ముందుకు నందమూరి ఫ్యామిలీ
అమరావతి: కృష్ణా జిల్లాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెడతానని తన ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా ప్రకటన చేసిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిమ్మకూరులోని నందమూరి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, నీరు - చెట్టులో అవినీతి జరిగిందన్న ఆయన ఆరోపణలను కొట్టిపారేశారు.
తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని జగన్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే, స్వయంగా నందమూరి కుటుంబ సభ్యులు అవినీతిపై ఫిర్యాదు చేశారనే విషయం కూడా కలకలం రేపింది. దీంతో వారు మీడియా ముందుకు వచ్చారు.

నిమ్మకూరులో అవినీతి జరగలేదు
నిమ్మకూరులో నీరు - చెట్టులో అవినీతి జరగలేదని నందమూరి కుటుంబ సభ్యులు చెప్పారు. వైయస్ జగన్ వ్యాఖ్యలు సరికావని వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయ లబ్ధి కోసం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని ప్రకటన చేశారని అన్నారు. రాష్ట్రంలో అందరి గుండెల్లో ఉన్న ఎన్టీఆర్‌ను ఒక్క జిల్లాకు పేరు పెట్టి, ఆయనను ఒకే జిల్లాకు పరిమితం చేయడం సరికాదన్నారు. ఎన్టీఆర్ వంటి వారిని ఒకే జిల్లాకు పరిమితం చేయడం ఏమిటన్నారు.

ఎన్టీఆర్ పేరు పెడితే రాజీనామా అని నాటకాలు
జగన్ అధికారంలోకి వచ్చేది లేదని, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టేది లేదని మంత్రి జవహర్ అన్నారు. ఎన్టీఆర్ పేరును కావాలనే వివాదాస్పదం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ పేరు పెడితే వైసీపీకి రాజీనామా చేస్తానని వైసీపీ నేత దుట్టా రామచంద్రా రావు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దుట్టా రామచంద్రా రావు వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కూడా కాదని, దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్నారు. జగన్ అధికారంలోకి వచ్చేది లేదు, పేరు పెట్టేది లేదని, ఏం చేయాలన్నా టీడీపీయే చేయాలన్నారు.

ఎన్టీఆర్ పేరు పెట్టాలనుకున్నాం
జిల్లాలు పెరిగాక నిమ్మకూరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎప్పుడో నిర్ణయించామని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ధర్మ పోరాటం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వైసీపీ నయవంచన దీక్ష చేపట్టారన్నారు. విజయసాయి రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు రూ.3 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తున్న విజయసాయికి అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంతో తెలుసా అన్నారు.

ప్రాణహానీ లేదు
ఇదిలా ఉండగా, కొనకళ్ల నారాయణ రావుతో తమకు ప్రాణహానీ ఉందని జగన్‌కు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులుగా చెప్పుకున్న వారు ఫిర్యాదు చేయడంపై ఫిర్యాదుదారు తనయుడు శ్రీరామ్ స్పందించారు. తమకు ప్రాణహానీ లేదన్నారు. పామర్తి అనిల్ తమపై తప్పుడు కేసులు పెట్టాడని చెప్పారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, జగన్‌కు తమ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన విషయం మీడియాలో తెలిసి తాను స్పందించినట్లు తెలిపారు. గత కొంతకాలంగా తమ తల్లిదండ్రులతో మాటలు లేవన్నారు.












Click it and Unblock the Notifications