ఏపీలో ఆ జిల్లాల్లో పెనం మీద ఉన్నట్టే- అత్యధిక ఉష్ణోగ్రత
ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఉపరితల ఆవర్తనం వల్ల మొన్నటివరకు వర్షాలు పడ్డాయి గానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి.

ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. శుక్రవారం నంద్యాల, కడప జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 42.1 డిగ్రీ, కడప జిల్లా కమలాపురంలో 42.0 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రత రికార్డయింది.
పల్నాడు, తిరుపతి జిల్లాల్లోని గురజాల, వరదయ్యపాలెంలో 41.8 డిగ్రీల మేర టెంపరేచర్ నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా- పెద్దపారుపూడిలో 41.0, ఏలూరు- ధర్మాజీగూడెంలో 40.4, మార్కాపురం-బొట్ల గూడూరులో 40.2, అనంతపురం- తెరన్నపల్లిలో 41.6, అన్నమయ్య- కంభంవారిపల్లెలో 40.1, కర్నూలు- తోవిలో 41.4, తూర్పు గోదావరి- చిట్యాలలో 40.0 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాయలసీమలోని దాదాపు అన్ని జిల్లాల్లో 40 నుండి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే నేడు 68 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని, తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని సూచించారు.












Click it and Unblock the Notifications