నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం.. అంతర్జాతీయ అవార్డు
సీఎం నారా చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కనుంది. పారిశ్రామిక నాయకత్వం, ప్రజా సేవ , సామాజిక సాధికారత రంగాలలో ఆమె చేసిన విశేష కృషికి గాను, లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025' అవార్డుకు ఆమెను ఎంపిక చేసింది.
ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి భువనేశ్వరి శనివారం రాత్రి హైదరాబాద్ నుండి లండన్‌కు బయలుదేరనున్నారు. నవంబర్ 4వ తేదీన లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్ వేదికగా జరిగే కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు.

'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్' అవార్డును ఐఓడీ సంస్థ విశిష్ట వ్యక్తులకు మాత్రమే అందిస్తుంది. గతంలో ఈ గౌరవాన్ని పొందిన వారిలో దివంగత భారత మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో-చైర్మన్ గోపిచంద్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్‌పర్సన్ రాజశ్రీ బిర్లా వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఉన్నారు. ఇప్పుడు నారా భువనేశ్వరి వారి సరసన నిలవనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సాధికారతకు ఆమె చేస్తున్న కృషిని ఈ సంస్థ ప్రత్యేకంగా గుర్తించింది.
వ్యక్తిగత అవార్డుతో పాటు, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలో కూడా భువనేశ్వరి మరో ముఖ్యమైన అవార్డును అందుకోనున్నారు. ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్స్ విభాగంలో జాతీయ స్థాయిలో హెరిటేజ్ ఫుడ్స్‌కు లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును అదే వేదికపై ఆమె స్వీకరించనున్నారు. ఎఫ్‌ఎంసీజీ (FMCG) విభాగంలో కంపెనీ పాటించిన అత్యుత్తమ పాలనా ప్రమాణాలకు ఈ గౌరవం దక్కింది.
లండన్‌లో సీఎం చంద్రబాబు పారిశ్రామిక భేటీలు
వ్యక్తిగత పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్‌లో పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) కోసం లండన్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులను, అలాగే ప్రవాసాంధ్రులను ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించనున్నారు. ఈ పర్యటన ముగించుకొని నవంబర్ 6వ తేదీన సీఎం తిరిగి రానున్నారు.












Click it and Unblock the Notifications