చంద్రబాబు అరెస్టై 19 రోజులైనా ఆధారాల్లేవు-సీఐడీపై నారా భువనేశ్వరి ఫైర్..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన కుటుంబ సభ్యులు పార్టీ నేతలు చేపడుతున్న నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న టీడీపీ నిరసనల్లో పాల్గొంటున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇవాళ సీఐడీ, ప్రభుత్వం తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఐడీ ఇప్పటికీ చంద్రబాబుకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు చూపలేకపోతోందన్నారు.

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఇవాళ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో భువనేశ్వరి పాల్గొన్నారు. అనంతరం స్ధానిక చర్చికి వెళ్లి ప్రార్ధనల్లోనూ పాల్గొన్నారు. అనంతరం సీఐడీ తీరుపై భువనేశ్వరి మండిపడ్డారు. చంద్రబాబు ఏ తప్పు చేశారని 19 రోజులుగా ఆయన్ను జైల్లో పెట్టారని ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండానే నిర్బందిస్తారా, ఆరోపణల్లో వాస్తవం ఏంటో తెలుసుకోరా అని ఆమె ప్రశ్నించారు.

చంద్రబాబు అరెస్టు అయి ఇన్ని రోజులు గడుస్తున్నా ఆయన ఏం తప్పు చేశారో చెప్పలేకపోతున్నారని భువనేశ్వరి తెలిపారు. ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారన్నారు. ప్రజల మనిషిని జైల్లో నిర్బంధించారన్నారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా సాగుతున్న శాంతియుత నిరసనల్ని సైతం పోలీసులు అడ్డుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. లోకేష్ పాదయాత్రను కూడా పలుమార్లు అడ్డుకున్నారని భువనేశ్వరి విమర్శించారు.

చంద్రబాబు హయాంలో పెట్టిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో శిక్షణ తీసుకున్న యువత ఇప్పుడు లక్షలు, లక్షలు సంపాదిస్తున్నారని భువనేశ్వరి తెలిపారు. వారంతా చేయి చేయి కలిపి చంద్రబాబుకు అండగా నిలుద్దామని భువనేశ్వరి కోరారు. రాజమండ్రి జైల్లో గతవారం ములాఖత్ తర్వాత సీఐడీ కస్టడీ కారణంగా రెండో ములాఖత్ లో కలవలేకపోయిన భువనేశ్వరి, బ్రాహ్మణి నిన్న ఈ వారం ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిశారు.












Click it and Unblock the Notifications