చంద్రబాబును అందుకే అరెస్ట్ చేశారు: నారా బ్రాహ్మణి
రాజకీయ దురుద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును జైలుకు పంపించారని ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఆరోపించారు. బాబు అరెస్ట్ కు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బ్రాహ్మణితోపాటు భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని, చంద్రబాబు, లోకేష్ కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకపోతున్నారన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలను చంద్రబాబునాయుడు ఎంతో అభివృద్ధి చేశారని, 42 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నేతను జైల్లో పెట్టారని, తమ కుటుంబానికి ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? అని ప్రశ్నించారు. లక్షలాది మంది యువతకు నైపుణ్యం పెంచేందుకు ఎంతో కృషిచేశారని, అభివృద్ధి, సంక్షేమం చేయడం కూడా నేరమేనా అన్నారు.

ఇప్పుడున్న ప్రభుత్వం గంజాయి, లిక్కర్ తో ఎంతోమంది యువత జీవితాలను నాశనం చేస్తోందని, ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి బాబుకు మద్దతు తెలియజేస్తున్నారన్నారు. జాతీయ నేతలు కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారని, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకముందన్నారు. ప్రజల కోసమే చంద్రబాబు ఎప్పుడూ కష్టపడేవారని, ఆయనకు మద్దతు తెలియజేస్తున్న అందరికీ తమ ధన్యవాదాలన్నారు. నిర్దోషిగా బయటకు వస్తారన్నారు.












Click it and Unblock the Notifications