ఏపీకి లోకేశ్, చంద్రబాబు - పవన్ తో భేటీ: కీలక నిర్ణయం..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు(chandra Babu) అరెస్ట్ తరువాత టీడీపీ, జనసేన(TDP Janasena) పొత్తు ఖాయం చేసుకొని..ఉమ్మడి కార్యాచరణకు సిద్దం అవుతున్నాయి. మూడు వారాలుగా ఢిల్లీలోనే మకాం వేసిన నారా లోకేశ్(Nara Lokesh) ఈ రోజు తిరిగి రాష్ట్రానికి వస్తున్నారు. రేపు (శుక్రవారం) చంద్రబాబును కలవనున్నారు. పవన్(Pawan) తో సమావేశం కానున్నట్లు సమాచారం. రెండు పార్టీల భవిష్యత్ కార్యాచరణపైన కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
23 రోజుల తరువాత:చంద్రబాబు అరెస్ట్ తో యువగళం యాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేశ్ సెప్టెంబర్ 14 వ తేదీన ఢిల్లీ వెళ్లారు. సుమారు మూడు వారాలు తర్వాత లోకేష్ రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. రాష్ట్రానికి వస్తే లోకేష్‌ను కూడా సీఐడీ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి కూడా లోకేష్ కొన్ని రోజులపాటు అరెస్ట్ కాకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్లు దాఖలు చేసారు. అటు సీఐడీ ఢిల్లీ వెళ్లి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. దీని పైన కోర్టుకు వెళ్లిన లోకేశ్ కు 10వ తేదీన విచారణకు హాజరవ్వాలని కోర్టు సూచించింది. దీంతో, ఈ రోజు రాజమండ్రి చేరుకోనున్న లోకేశ్ తిరిగి 9వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు.

చంద్రబాబుతో భేటీ:లోకేశ్ శుక్రవారం చంద్రబాబుతో భేటీ కానున్నారు. కోర్టులో కేసులు..పార్టీ పరంగా భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించే అవకాశం ఉంది. ఆ తరువాత పార్టీ ముఖ్య నేతలతోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ కు సమయం దగ్గర పడటంతో అక్కడ పోటీ..అభ్యర్దుల ఎంపికపైనా చంద్రబాబు సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ తరువాత జనసేన అధినేత పవన్ తోనే సమావేశం అవుతారని సమాచారం. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయం కావటంతో..వారాహి యాత్రలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని లోకేశ్ పిలుపునిచ్చారు. రెండు పార్టీల నుంచి నేతలతో కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు పైన నిర్ణయం తీసుకోనున్నారు.

ఉమ్మడి కార్యాచరణ:వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ పైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9న సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విషయంలో వెలువడే నిర్ణయం చూసిన తరువాత రాజకీయంగా కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.
అదే సమయంలో బెయిల్ పైన విచారణ కొనసాగుతుండటంతో త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కోర్టులో నిర్ణయానికి అనుగుణంగా నడుచుకొనే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఈ నెల 10న సీఐడీ ముందు లోకేశ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో, ఇప్పుడు ఏపీలో రాజకీయ..న్యాయ వ్యవహారాలు ఉత్కంఠ పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications