మానవ జన్మను వృథా చేసుకోవద్దు నారా లోకేష్
జీవితమే పెద్ద పరీక్ష అని, భవిష్యత్తులో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఇంటర్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మహా అయితే ఒక ఏడాది వృథా అవుతుందని, అంతకుమించి నష్టపోయేదేం లేదన్నారు.
సృష్టిలో అద్భుతం.. మానవ జన్మ : సృష్టిలో అద్భుతమైన వరం మానవ జన్మ అని, అటువంటి జన్మను బలవన్మరణంతో ముగించడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. పరీక్షలు తప్పిన విద్యార్థులే భవిష్యత్తులో గొప్ప ఆవిష్కరణలు చేసే సైంటిస్ట్ లు కావొచ్చని, మార్కులు తగ్గాయని తనువు చాలించేవారే రేపు దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యే నిపుణులుగా తయారవుతారన్నారు. అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లన్నీ పరీక్షలేనని, అందులో విజయాలు ఉంటాయి, అపజయాలుంటాయన్నారు. ఈరోజు ఓటమి రేపటి గెలుపునకు మార్గం లాంటిదని, మార్కులు తగ్గాయంటూ ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దంటూ ట్వీట్ చేశారు.

మంగళగిరిలో ఓడిపోయినందుకు నన్ను ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు : ప్రాణాలు తీసుకునేముందు అందరూ ఒకసారి ఆలోచించాలన్నారు. పరీక్షలో అందరికంటే నీకే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుందని, వారందరికన్నా ఉన్నతమైన ఉద్యోగం పొందచ్చని, అవకాశాలు వచ్చేవరకు బతికుండాలని సూచించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తాను ఓటమిపాలయ్యానని, నన్ను ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారని, ఓడిపోయానని తాను బెదరలేదు.. ఎక్కడికీ పారిపోలేదన్నారు. మరింత గొప్పగా పోరాడుతున్నానని, ఓడినచోటే గెలుస్తానన్నారు. వారి హేళనలే తన విజయధ్వానాలు చేసుకుంటానన్నారు.
జీవితమే ఓ పరీక్ష. అనేక పరీక్షలు ఎదురవుతాయి. అందులో టెన్తో, ఇంటరో పరీక్ష తప్పితే ఏమవుతుంది? మహా అయితే ఒక ఏడాది వృథా అవుతుంది. ఈ మాత్రానికే సృష్టిలో అద్భుతమైన వరమైన మానవ జన్మని బలవన్మరణంతో ముగించడం అర్థరహితం.(1/6) pic.twitter.com/qwo6BrB97M
— Lokesh Nara (@naralokesh) April 28, 2023
తల్లిదండ్రులు, గురువు, దైవం అండగా ఉంటారు : పరీక్ష పోతే పోయేదేమీ లేదన్నారు. తల్లిదండ్రులు, గురువు, దైవం అందరూ మీకు అండగా ఉంటారని, బంగారు భవిష్యత్తు మీ కోసం ఎదురుచూస్తోందన్నారు. బలవంతంగా ఎవరూ తనువు చాలించొద్దని సూచించారు. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగి సమాజాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత ఫెయిలైన విద్యార్థులు, మార్కులు తగ్గాయనే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నారు. 9మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.












Click it and Unblock the Notifications