కేసీఆర్ 'బెజవాడ'పై లోకేష్ కౌంటర్, దత్తాత్రేయకి పిలుపు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబును తిట్టడం తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పగానే, తాము కూడా చేపడతామని కేసీఆర్ అంటున్నారని విమర్శించారు.
అయితే, వాటర్ గ్రిడ్ కోసం 12 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందన్న సంగతి కేసీఆర్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని విడగొట్టడంతో, తమ భూముల రేట్లు భారీగా పెరిగాయని ఆంధ్రప్రదేశ్ రైతులు ఆనందంలో ఉన్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో తమ రాష్ట్రాలకు కొత్త ప్రాజెక్టులు రావడం లేదని ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నారన్నారు.
ఇప్పటికే నిధులన్నీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయని, భవిష్యత్తులో ఏపీ వెలిగిపోతుందని అంటున్నారన్నారు. హుస్సేన్ సాగర్‌ను ప్రక్షాళన చేస్తామని కేసీఆర్ అంటున్నారని, ప్రక్షాళన చేసిన తర్వాత తొలి గ్లాసు నీటిని ఆయనే తాగాలని సవాల్ చేశారు. దళితుడిని సీఎం చేయకపోతే తల నరుక్కుంటానని అన్న కేసీఆర్ ఇప్పుడేమి చేస్తున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని కాపీ చేసే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారన్నారు. సీఎం అయినప్పటి నుంచి కేసీఆర్ ప్రారంభించిన పథకం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన ప్రజా సమస్యలనే మావోయిస్టులు కూడా లేవనెత్తుతున్నారన్నారు.
కేసీఆర్ వచ్చాక పోలీసులకు కొత్త కార్లు ఇవ్వడం మినహా చేసిందేమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై పలు రాష్ట్రాలు ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశాయన్నారు. కేసీఆర్ విజయవాడలో సభ పెట్టి తిట్టడం తప్పితే ఏం చేస్తారని ప్రశ్నించారు.
కాగా, చంద్రబాబు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. చంద్రబాబు తొలి సభ్యత్వం తీసుకున్నారు. ఆరు రాష్ట్రాల్లో ఐపాడ్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మూడేళ్లపాటు ఇవ్వండి: ఛత్తీస్‌గఢ్ సీఎంకు దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొందని, దీని ప్రభావంతో రైతుల ఆత్మహత్యలు, చిన్న తరహా పరిశ్రమల మూసివేతలు కొనసాగుతున్నాయని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ వివరించారు.
మూడేళ్ల పాటు తెలంగాణకు 1000 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయాలని కోరారు. ఏడాదిలోగా రెండు రాష్ట్రాల మధ్య గ్రిడ్ కనెక్షన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి లేఖ రాయాలని రమణ్ సింగ్‌ను కోరారు. ఛత్తీస్‌గఢ్ సీఎం కోరిక మేరకు అక్కడకు వెళ్లిన బండారు దత్తాత్రేయ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కాగా, అంతకుముందు దత్తాత్రేయకు ఫోన్ చేసి రమణ్ సింగ్ విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయనను రాష్ట్రానికి ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications