నా యాత్రనూ, వారాహినీ ఆపండి-లోకేష్ సవాల్ ! త్వరలో యూత్ మ్యానిఫెస్టో-షరతుల్లేని సంక్షేమం
ఏపీలో ఇవాళ యువగళం పాదయాత్ర ప్రారంభించి టీడీపీ యువనేత నారా లోకేష్.. జగన్ సర్కార్ కు తొలిరోజే సవాళ్లు విసిరారు. చేతనైతే తన పాదయాత్రను, పవన్ వారాహిని అడ్డుకోవాలని సవాల్ చేశారు.
ఏపీలోని కుప్పం నుంచి యువగళం పేరుతో ఇవాళ పాదయాత్ర ప్రారంభించిన టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్.. కుప్పంలో బహిరంగసభ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి లోకేష్ తొలి ప్రసంగం చేశారు. ఓవైపు వైఎస్ జగన్ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టిన లోకేష్.. మరోవైపు గతంలో తన తండ్రి చంద్రబాబు పాలనలో ఏం చేశామో చెప్పుకొచ్చారు. అంతే కాదు మిత్రుడు పవన్ కళ్యాణ్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కుప్పం బహిరంగసభలో లోకేష్
ఉదయం కుప్పంలో పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్.. మధ్యాహ్నం తర్వాత బహిరంగసభ ఏర్పాటు చేశారు.
ఇందులో లోకేష్ కీలక ప్రసంగం చేసారు. ఎన్టీఆర్ ది చైతన్యరథమైతే, చంద్రన్నది వస్తున్నా మీకోసమేతే, నాది యువగళం అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. యువగళం పేరు ప్రకటించిన వెంటనే వైసీపీ నాయకుల ఫ్యాంట్లు తడిచాయన్నారు. పది మంది మంత్రులు తనపై దాడి చేశారన్నారు. నన్నో ప్రశ్న అడిగారని, ఏ అర్హతతో నేనీ పాదయాత్ర చేస్తున్నానని.. కానీ రెండున్నరేళ్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశానని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 25 వేల కిలోమీటర్ల రోడ్డు వేయించానని, ఐటీ ఎలక్ట్రానిక్ మంత్రిగా యువతకు 40 వేల ఉద్యోగాలు ఇప్పించానన్నారు. మంత్రులేం చేశారంటూ లోకేష్ ప్రశ్నించారు. మూడున్నరేళ్లుగా ఏం పీకారంటూ మంత్రుల్ని ప్రశ్నించారు.

పాదయాత్ర ఇందుకే
కేసినోలు నడిపిస్తే పరిశ్రమలు రావని మాజీ మంత్రికి చెప్తున్నానంటూ కొడాలిని ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యానించారు.
పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏపీ ఏర్పడితే, ఎన్టీఆర్ వల్ల దేశంలోనే తెలుగుజాతి గర్వపడేలా చేశారన్నారు. ఏపీ అభివృద్ధి కోసం ఎంతో మంది సీఎంలు త్యాగాలు చేశారని, గత మూడేళ్ల ఎనిమిది నెలల్లో రాష్ట్రాన్ని నాశనం చేశాడని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 67 సంవత్సరాలు వెనక్కి నెట్టారన్నారు.యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, అందరూ ఈ ప్రభుత్వ బాధితులేనన్నారు. ఏపీలో ఎవరన్నా మాట్లాడితే కేసులు, ఉద్యమిస్తే జైలే అని లోకేష్ విమర్శించారు. వేలాది మంది యువకులు తనను కలిశారని, రాష్ట్ర పరిస్దితి ఏంటని అడిగారన్నారు. అందుకే యువగళం పాదయాత్ర మొదలుపెట్టానన్నారు.

పరిశ్రమలు లేక ఉద్యోగాలు రాక
యువత ఈ ప్రభుత్వంపై పోరాడేందుకు ఇదో మంచి అవకాశమని లోకేష్ తెలిపారు. జగన్ రెడ్డి అంటూ జాదూరెడ్డి తనకుగుర్తుకొస్తాడన్నారు. మైసూరు బోండాలో మైసూరు ఉండదు, ఈ జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలుండవన్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తే 36 ఉద్యోగాలా అని ప్రశ్నించారు. ఈ జాదూరెడ్డి యువకుల్ని మోసం చేశాడన్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో చెల్లీ, తమ్ముడూ 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానన్నాడు. ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. ఇచ్చాడా అని ప్రశ్నించారు. నాలుగేళ్లలో జాబ్ క్యాలెండర్ ఏమైంది, ప్రతీ ఏటా 6500 పోలీసు కానిస్టేబుల్ పోస్టులు ఇస్తానని ఒక్క పోస్టుకూడా భర్తీ చేయలేదన్నారు. మెగా డీఎస్సీ అన్నాడని, ఒక్క పోస్టు తీయలేదన్నారు. జే ట్యాక్స్ వల్ల ఏపీలో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయన్నారు.జేట్యాక్స్ వల్లే అమరరాజా పక్క రాష్ట్రానికి వెళ్లిపోయిందన్నారు.
గల్లా జయదేవ్ వేల కోట్ల పెట్టుబడులు పెట్టి వేల ఉద్యోగాలు కల్పిస్తున్నారు, కానీ జే ట్యాక్స్ కట్టలేదని తరిమేశారు
దీని వల్ల రాష్ట్రంలో యువత ఉద్యోగాలు కోల్పోయిందన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదీ
అభివృద్ధి వికేంద్రీకరణ అంటే చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు అని లోకేష్ తెలిపారు. అనంతపురంకి కియా, జాకీ కంపెనీలు తెస్తే జగన్ జాకీని పక్క రాష్ట్రానికి పంపేశారన్నారు. చంద్రబాబు కర్నూలుకు సిమెంట్ కంపెనీలు, సోలార్ పవర్ ప్లాంట్లు తెచ్చారన్నారు. చిత్తూరుకు శ్రీసిటీ, ప్రకాశం జిల్లాకు ఏషియన్ పేపర్ మిల్స్, గోదావరి జిల్లాకు డిఫెన్స్ పరిశ్రమలు, ఉత్తరాంధ్రకు ఐటీ పరిశ్రమలు తెచ్చారు. ఆదానీ డేటా సెంటర్ తెచ్చామన్నారు. ఇదీ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్నారు.జగన్ రెడ్డి మూడు రాజధానుల్లో ఎక్కడైనా ఇటుక వేశావా అని అడుగుతున్నా, ఒక్క పరిశ్రమ తెచ్చావా అని అడిగారు. ప్రత్యేక హోదాతో ఉద్యోగాల వర్షం కురుస్తుందన్నారు, ఢిల్లీ మెడలు వంచుతానన్నారు, నీ పైన ఉన్న కేసుల వల్లే ప్రత్యేక హోదా ఏపీకి రాలేని పరిస్ధితి ఉందన్నారు.

త్వరలో యూత్ మ్యానిఫెస్టో
ఈ సందర్భంగా రాష్ట్రంలో యువతకు లోకేష్ ఓ హామీ ఇచ్చారు. యూత్ మ్యానిఫెస్టో తీసుకురాబోతున్నట్లు లోకేష్ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తామనేది, స్వయం ఉపాధి ద్వారా ఎంత మందిని ఆదుకుంటామనేది ఇందులో ప్రకటిస్తామన్నారు. అలాగే ప్రతీ ఏటా డీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతామని లోకేష్ హామీ ఇచ్చారు. రివర్స్ మైగ్రేషన్ మా అజెండా అన్నారు. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్ల పనిచేస్తున్నారు, ఏపీలోఅవకాశాలు కల్పించి వారందరినీ ఇక్కడికి తెస్తామన్నారు.

నన్నూ, పవన్ ను అడ్డుకోవాలని సవాల్
జీవో 1తో ప్రజాసమస్యలపై పోరాడకుండా, కలిసి వెళ్లకుండా టీడీపీ నేతల్ని, పవన్ కళ్యాణ్ ను సైతం అడ్డుకుంటున్నారని లోకేష్ ఆరోపించారు. వారాహికీ ఏపీలో అనుమతులు ఇవ్వరంట అని లోకేష్ ఆక్షేపించారు. జీవో 1 ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోమని, వారాహీ ఆగదు, యువగళం కూడా ఆగదన్నారు. యువత తరఫున పోరాడటానికి యువగళం ప్రారంభించామన్నారు. అడ్డొస్తే తొక్కుకుని వెళ్లిపోతామన్నారు. జాదూ రెడ్డీ భయం నా బయోడేటాలో లేదన్నారు. అందరూ తనను ఆశీర్వదించాలని కోరారు.

రోజాపై లోకేష్ సెటైర్లు
ఎన్నికల ముందు ఈ జాదూరెడ్డి మహిళలపై దాడి జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడన్నాడు, అది బులెట్ లేని గన్ అని అర్ధమైంది, సౌండ్ ఎక్కువ పని తక్కువ అన్నారు. పులివెందులలో నాగమ్మ అనే దళిత మహిళను చంపేస్తే న్యాయం జరగలేదు, ఇలా 900 మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ప్రభుత్వం స్పందించలేదన్నారు. అసెంబ్లీలో
21 రోజుల్లో ఉరేస్తా, దిశ చట్టం తెచ్చానని జగన్ చెప్పారు, ఏమైంది నీ దిశ 900 మంది మహిళలపై దాడుల కేసుల్లో ఎంత మందికి ఉరిశిక్ష వేశారని ప్రశ్నించారు. వైసీపీ మహిళా నాయకురాలు నేను మాట్లాడితే చీరలు, గాజులు పంపిస్తానని చెప్తారని రోజాపై వ్యాఖ్యలు చేశారు. చీరలు, గాజులేసుకున్నోళ్లు చేతకానోళ్లా అని డైమండ్ రాణిని అడిగారు. ఓ మహిళా మంత్రి అయి ఉండి ఇలా మాట్లాడొచ్చా, పంపించండి ఆ చీరలు, గాజులు నా అక్కాచెల్లెళ్లకు పెట్టి వాళ్ల కాళ్లు మొక్కుతా, మీ నాయకుడిలా తల్లీ, చెల్లిని మెడ పట్టి బయటకు గెంటన్నారు.












Click it and Unblock the Notifications