రాటు దేలుతారా: నారా లోకేష్ వ్యూహకర్త ఎంపిక, ఎవరతను?
చంద్రబాబు వారసుడిగా రాటుదేలడానికి బాడీ లాంగ్వేజ్‌కు, స్పీచ్‌లకు పదను పెట్టుకోవడానికి నారా లోకేష్ ఓ సలహాదారుడిని ఎంపిక చేసుకున్నారు. ఇంతకీ ఆయనెవరు...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ ప్రసంగాలపై ఇటీవల జోకుల మీద జోకులు పేలుతున్నాయి. ఆయన ప్రసంగాలపై, ఆంగికచాలనంపై ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పనిగట్టుకుని వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది.
తన ప్రసంగాల్లోనే కాకుండా ట్వీట్లలో కూడా దొర్లుతున్న లోపాలను సరిదిద్దుకునే పనికి నారా లోకేష్ శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఇందుకు ఆయన ఓ వ్యక్తిని నియమించుకున్నారని సమాచారం. ఆయన ప్రేక్షకుల్లో ప్రేక్షకుడిగా ఉండిపోయి నారా లోకేశ్ ప్రసంగశైలిని, ఆంగిక చలనాన్ని పరిశీలిస్తారని సమాచారం.
ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో పరిశీలించడమే కాకుండా తనకు తోచిన లోపాలను కూడా ఆయన పసిగట్టి నారా లోకేశ్ ప్రసంగ పాటవాన్ని, దేహ కదలికలను మార్చడానికి సలహాలు ఇస్తారని సమాచారం. పెద్ది రామారావు అనే కవిని, నాటక రంగ నిపుణుడు ఆ పనిచేస్తున్నట్లు సమాచారం.

నారా లోకేష్ సమస్య ఏమిటి...
నారా లోకేష్ ఏం మాట్లాడినా ఏదో లోపం బయటపడుతూనే ఉన్నది. ప్రసంగంలో ముందుకు చెప్పినదానికి, తర్వాత చెప్పిన దానికి మధ్య పొంతన ఉండడం లేదు. అంటే లింక్ తెగుతోంది. వాడే భాష అంత ఆకర్షణీయంగా ఉండడం లేదు. ఏం చెప్పుతున్నాడనే దానికన్నా చెప్పేదాన్ని ఓ రాజకీయ నాయకుడి శైలిలో ఏకధాటిగా చెప్పే గుణం లోపిస్తోంది.

పర్యటనలు సరే...
నారా లోకేష్ ప్రజల్లో ఎక్కువగానే ఉంటున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు పరామర్శలు, ఓదార్పులు చేస్తున్నారు. చంద్రబాబు వారసుడిగా రాటుదేలడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, వేదికల మీది నుంచి ప్రసంగించే సమయంలో తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటోంది, వాడుతున్న భాషతో పాటు దాన్ని ఆసక్తికరంగా చెప్పగలుగుతున్నానా లేదా అనేది పరిశీలించి సూచనలు చేయడానికి ఆయన పెద్ది రామారావు అనే కవిని ఎంపిక చేసుకున్నారు.

ఓ జట్టు ఉంది...
వివిధ అంశాలపై ఫీడ్ బ్యాక్ ఇవ్వడానికి, సూచనలు చేయడానికి నారా లోకేష్‌కు ఓ సలహాదారుల జట్టు ఉంది. ఈ జట్టులోని వ్యక్తుల్లో పెద్ది రామారావు లోకేష్ ప్రసంగాలకు సహాయం చేస్తుంటారని వార్తలు. ఆయన జనం మధ్యలో నించుని లేదా ప్రేక్షకుల మధ్య కూర్చుని ప్రజల స్పందనను గమనిస్తూ ఉంటారు. తదుపరి ప్రసంగాల్లో తగిన మార్పులు చేర్పులు చేస్తుంటారని సమాచారం.

ఎవరీ పెద్ది రామారావు
పెద్ది రామారావు తెలుగు కవి. నాటక ప్రయోక్త,. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం థియేటర్ ఆఫ్ ఆర్ట్స్‌లో పనిచేస్తుంటారు. పూర్వం జర్నలిస్టుగా పనిచేసేవారు. రుతురాగాలు వంటి కొన్ని తెలుగు సీరియళ్లకు సంభాషణలు కూడా కూర్చారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందినవారు. హైదరాబాదు వచ్చిన తర్వాత ఆయన జర్నలిస్టుగా పనిచేశారు. మేధావులు, రచయితలు, కవులు, సినీ ప్రముఖులతో ఆయనకు విశేష పరిచయాలున్నాయి. ఆయన 2013 నుంచి 2014 వరకు హైదరాబాదులో తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినట్లు సమాచారం. ఆ తర్వాత ఇప్పుడు నారా లోకేష్‌ను ప్రజానాయకుడిగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించినట్లు చెబుతున్నారు.

రాజీవ్ కనకాల సోదరినే...
పెద్ది రామారావు సినీ నటుడు రాజీవ్ కనకాల సోదరిని వివాహం చేసుకున్నాడు. రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. పెద్ది రామారావు మాత్రం నారా లోకేష్‌కు దగ్గరగా ఉంటారు. లోకేష్ వ్యూహబృందంలో ఒకరు. పెద్ది రామారావు 2009లో ఎన్టీఆర్ సభలకు ప్రసంగాలు తయారు చేసినట్లుగా కూడా చెబుతారు. అప్పటి స్పందన చూసే నారా లోకేష్ పెద్ది రామారావును చేరదీసినట్లు చెబుతారు.












Click it and Unblock the Notifications