టిడిపి సదస్సు: పార్టీ ఆఫీసులో నారా లోకేష్ హల్‌చల్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మేధోమథన సదస్సు సందర్భంగా శనివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ పార్టీ కార్యాలయంలో హల్‌చల్ చేశారు. దీంతో పార్టీ వ్యవహారాల్లో నారా లోకేష్ ప్రత్యక్ష ప్రమేయం ప్రారంభమైంది. పార్టీ మేధో మథన సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. రెండో రోజు శనివారం కూడా జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ పార్టీ కార్యాలయానికి వచ్చారు.
లోకేష్ పార్టీ కార్యాలయానికి వచ్చిన తర్వాత పార్టీ నాయకులకు ఎన్నికలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగునాడు విద్యార్థి సమాఖ్య, తెలుగు యువత నాయకులతో, పార్టీ ముఖ్యులతో ఆయన సమావేశమయ్యారు. డిసెంబర్ లేదా జనవరిలో రాష్ట్రంలో తాను చేపట్టే సదస్సులపై ఆయన ఈ సమావేశంలో చర్చించారు.

దీన్నిబట్టి తెలుగుదేశం పార్టీ విద్యార్థి, యువజన విభాగాలకు నారా లోకేష్ నేతృత్వం వహించడం ఖాయమైనట్లు భావిస్తున్నారు. పార్టీ వైపు యువతను ఆకర్షించడానికి ఆయన విస్తృతంగా పర్యటనలు జరపాలని అనుకుంటున్నారు.
విభజన ఓ కుట్ర
రాష్ట్ర విభజన అనేది రాజకీయ కుట్ర అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. పార్టీ మేధోమథన సదస్సులో ఆయన ప్రసంగించారు. తాము ఎదుర్కుంటున్న ప్రతి కష్టానికి కూడా కాంగ్రెసు పార్టీయే కారణమని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాగ్రెసు భూస్థాపితం కావడం ఖాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications