చంద్రబాబు వారసత్వంపై టీడీపీలో అంతర్గత చర్చ: ఏదో తేడా కొడుతోందేంటీ?
CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ- మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఏర్పాటైన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటోన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో వివిధ మల్టీ నేషనల్ కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలతో వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, ఇన్‌ఫ్రా.. వంటి రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను సాధించడానికి కృషి చేస్తోన్నారు. నెక్ట్స్‌జెన్, డాటా ఫ్యాక్టరీ, ఏఐ యూనివర్శిటీ ఏర్పాటు వంటి అంశాలపై ఎన్‌విడియా, గూగుల్ వంటి సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరవుతున్నారు.

ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీలో వారసత్వంపై చర్చకు తెర లేచింది. చంద్రబాబు తరువాత పార్టీ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుంది? ఆయన రాజకీయ వారసుడు ఎవరు? అనే ప్రశ్నలపై చర్చలు సాగుతున్నాయి. పార్టీ అగ్ర నాయకత్వంలోనే ఈ చర్చ మొదలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దీనిపై తాజాగా టీడీపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తరువాత నాయకుడు నారా లోకేష్ బాబేనని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని, నిద్రపోయే వాళ్లను లేపి అడిగినా ఇదే సమాధానం వస్తుందని అన్నారు.
చంద్రబాబు తరువాత తెలుగుదేశం పార్టీ నాయకుడెవరంటే అర్ధరాత్రి లేపి ఎవరిని అడిగినా కళ్లు మూసుకుని లోకేష్ బాబేనని చెబుతారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇప్పుడు దాని గురించి వివాదం ఎందుకని, వివాదం చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. ఎవరు వద్దన్నా నారా లోకేష్ బాబే టీడీపీ వారసుడని చెప్పారు.
ఇప్పుడు జనసేన- భారతీయ జనతా పార్టీతో కూడిన కూటమిలో ఉన్నందున పదవులైనా, ఏ నిర్ణయాలనైనా పెద్దలు తీసుకున్న నిర్ణయాల మేరకు నడుచుకోవాలే తప్ప వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది కాదని అన్నారు. ఇది అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications