Nara Lokesh : పులివెందుల టీడీపీ నేతలకు లోకేష్ స్వీట్ వార్నింగ్..జగన్ పై కీలక వ్యాఖ్యలు..
ఏపీలో టీడీపీకి ఏమాత్రం ఆశల్లేని నియోజకవర్గాల్లో పులివెందుల ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా పరిగణించే పులివెందులలో టీడీపీ ఇక ఎప్పటికీ గెలవదని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ స్ధానిక పార్టీ నేతలు మాత్రం కాడి కింద పడేశారు. ముఖ్యంగా పార్టీ తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి వంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ లైట్ తీసుకున్నారు. దీనిపై ఇవాళ పులివెందుల పార్టీ నేతలతో జరిగిన భేటీలో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ పులివెందుల టిడిపి కార్యకర్తలు, నాయకులతో ఇవాళ సమావేశమైన నారా లోకేష్.. వారితో కీలక వ్యాఖ్యలు చేశారు.పులివెందులలో గెలవకపోయినా ఎప్పుడూ చిన్న చూపు చూడలేదని లోకేష్ తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లాగే పులివెందులను కూడా అభివృద్ది చేశామన్నారు. పులివెందులకు నీరు ఇచ్చింది టీడీపీ అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామన్నారు. రాజకీయ అవకాశాలు కూడా ఎక్కువ కల్పించామని, ఎన్నో పదవులు కూడా ఇచ్చామని లోకేష్ గుర్తుచేశారు.

జగన్ పాలనలో విపరీతంగా పన్నులు పెంచి ప్రజల్ని పీడిస్తున్నాడని, పులివెందుల ప్రజలు కూడా జగన్ బాధితులేనని లోకేష్ ఆరోపించారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు అనుకున్న మేర పులివెందులలో జరగలేదని ఈ సందర్భంగా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మనలో మార్పు రావాలి ప్రజలకి దగ్గర అవ్వాలని నేతలకు సూచించారు.
ప్రజా సమస్యల పై పోరాడినప్పుడే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారని చురకలు అంటించారు.
90వేల మెజారిటీ లో గెలిపించినందుకు జగన్ పులివెందులకు చేసింది ఏంటని లోకేష్ ప్రశ్నించారు. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? రోడ్లు వేసాడా? కోట్ల రూపాయలు మంజూరు చేశాను అంటున్నాడు. ఒక్క రూపాయి విడుదల చేసాడా? అని లోకేష్ ప్రశ్నించారు. జయంతి, వర్ధంతి కి తప్ప జగన్ పులివెందులకు చేసింది ఏంటని సూటిగా ప్రశ్నించారు. సీనియర్, జూనియర్లను సమానంగా గౌరవిస్తానని, కానీ పని చేసే వారికే పదవులు ఇస్తానని లోకేష్ వెల్లడించారు.

మీ బూత్ లో మెజారిటీ తెస్తేనే పదవులు ఇస్తామని నేతలకు టార్గెట్ పెట్టారు. నాయకులు అందరూ నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని లోకేష్ ఆదేశించారు. కేసులకు భయపడి ఇంట్లో పడుకుంటాం అంటే ప్రజలు హర్షించరని, పోరాడిన వారికే ప్రజల మద్దతు ఉంటుందన్నారు. గ్రూప్ రాజకీయాలని ప్రోత్సహించబోమన్నారు. భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం పులివెందులలో పక్కగా నిర్వహించాలని నేతలకు సూచించారు. నియోజవర్గంలో పనిచేయకుండా పదవులు అడగొద్దన్నారు.
కడప జిల్లా లో టీడీపీకి పెద్ద ఎత్తున ఆదరణ ఉందని, దానిని నాయకత్వం అందిపుచ్చుకోవాలని లోకేష్ సూచించారు. పులి వేటకి వెళ్లకపోతే పిల్లి అవుతుంది. టిడిపి నాయకులు అంతా పోరాడాలన్నారు. పులివెందుల లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు ఏమి జరగడం లేదన్నారు. నాడు - నేడు పేరుతో హడావిడి తప్ప పులివెందుల స్కూళ్ల లో కనీసం మౌలిక వసతులు లేవన్నారు. వందల కోట్ల తో రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసినా ఒక్క రోడ్డు పూర్తి చెయ్యలేదన్నారు.
పులివెందులకు చెందిన నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి గౌరవించామని, ఓడిపోయినా ఇంఛార్జ్ గా ఉండి పెత్తనం చెయ్యాలి అనుకుంటే ఇక కుదరదన్నారు. ఇంఛార్జ్ వ్యవస్థ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన అధికారుల పై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి సర్వీస్ నుండి తొలగిస్తామన్నారు. ఢీ అంటే ఢీ అనే వాళ్ళనే తాను గుర్తిస్తానని లోకేష్ తెలిపారు.












Click it and Unblock the Notifications