తిరుమలలో అరుదైన ఘట్టం- ఆర్జిత సేవలు రద్దు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 95,094 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 35,909 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.93 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.66 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. రికార్డు స్థాయిలో 3.23 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీని అందిస్తున్నారు. అదనపు షెడ్లను అమర్చారు.

కాగా.. జూన్ 26 నుండి 28వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ''అభిద్యేయక అభిషేకం'' అని కూడా అంటారు.
తరతరాలుగా అభిషేకాలతో స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు.
ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. కాగా జ్యేష్టాభిషేకాన్ని పురస్కరించుకుని జూన్ 28వ తేదిన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది.












Click it and Unblock the Notifications