చిన్నప్పుడు కారును కూడా తయారు చేశా..!!
బాపట్ల: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 165వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని సంతనూతనపాడు అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగుతున్నారాయన. చీమకుర్తి మీదుగా సంతనూతనపాడులో ఎంట్రీ ఇచ్చారు.
చీమకుర్తి శివార్లలోని ఎన్ఎస్పీ కాలనీ, నెహ్రూనగర్, మంచికలపాడు, చీమలమర్రి మీదుగా సంతనూతలపాడు శివారు వరకు పాదయాత్ర కొనసాగించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయక ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను కలిశారు. సంతనూతనపాడులోకి ఘన స్వాగతం పలికారు.

మరో ఏడాదిలో తమ ప్రభుత్వం వస్తుందంటూ నారా లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సభకు భారీగా ప్రజలు హాజరయ్యారు. గ్రానైట్ పరిశ్రమల గురించి మాట్లాడారు నారా లోకేష్. ఈ పరిశ్రమ సంక్షోభానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారకుడంటూ ఆరోపించారు.
ఈ సాయంత్రం ఆయన సంతనూతనపాడులో బైక్ మెకానిక్స్‌ను కలిశారు. వారితో చిట్‌చాట్ చేశారు. ఎప్పుడైనా బైక్ నడిపారా? అంటూ మెకానిక్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు నారా లోకేష్. బైక్ ఎప్పుడైనా రిపేర్ చేయించారా? అని వారు ప్రశ్నించగా.. అవునని బదులిచ్చారు. చిన్నప్పుడు సొంతంగా కారును కూడా తయారు చేశానని చెప్పుకొచ్చారు.

బైక్ నడపడం అంటే తనకు ఎంతో ఇష్టమని నారా లోకేష్ అన్నారు. ఎన్నోసార్లు బైక్ రిపేర్ వచ్చినప్పుడు మెకానిక్ దగ్గరకి రిపేర్‌కు తీసుకెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. తాను చిన్నప్పుడు కారును కూడా తయారు చేశానని పేర్కొన్నారు. తనకు ఓ మెకానిక్ ఫ్రెండ్ ఉండేవాడని, అతని దగ్గర బైక్ ఇంజిన్ తీసుకొని ఓ కారును డిజైన్ చేశానని చెప్పారు.
ఇద్దరు వ్యక్తులు సౌకర్యంగా ప్రయాణించేలా కారు తయారు చేశానని నారా లోకేష్ తెలిపారు. ఆ కారు ఇప్పటికీ తన వద్దే ఉందని, అప్పుడప్పుడు బయటికి తీస్తుంటానని చెప్పారు. చిన్నప్పుడు ఎన్ని సరదా పనులు చెయ్యాలో.. అన్నింటినీ చేశానంటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు నారా లోకేష్.












Click it and Unblock the Notifications