చిరంజీవి కామెంట్స్ పై లోకేశ్ కీలక వ్యాఖ్యలు- కట్టుకధలతో..!!
ఏపీ రాజకీయాలు చిరంజీవి కామెంట్స్ చుట్టూ తిరుగుతున్నాయి. చిరంజీవి వ్యాఖ్యల పైన ఏపీ మంత్రులు వరుసగా ఫైర్ అవుతున్నారు. ముందుగా తమ్ముడు పవన్ కు చిరంజీవి హితవు చెప్పాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో భోళా శంకర్ టికెట్ల ధరల పెంపుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా చిరంజీవి వ్యాఖ్యలపైన లోకేశ్ స్పందించాు.
చిరంజీవి వ్యాఖ్యల వివాదం:చిరంజీవి చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సమయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యల పూర్తి ప్రసంగం బయటకు వచ్చింది. తాజాగా రాజ్యసభలో జరిగిన చర్చలో వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి సినీ హీరోల రెమ్యునరేషన్ గురించి చేసిన వ్యాఖ్యల పైన చిరంజీవి స్పందించారు. పనిపాట లేదా అని వ్యాఖ్యానిస్తూ సినీ పరిశ్రమ ద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రోడ్లు, సంక్షేమం వంటి వాటి గురించి ప్రస్తావన చేయకుండా సినీ రెమ్యునరరేషన్ గురించి మాట్లాడటం పిచ్చుక పైన బ్రహ్మాస్త్రంగా పేర్కొన్నారు. తాను సినిమా..రాజకీయాలు రెండు చూసానని గుర్తు చేసారు. ఈ వ్యాఖ్యల పైన రాజకీయంగా దుమారం కొనసాగుతూనే ఉంది.

సమర్ధించిన లోకేశ్:చిరంజీవి వ్యాఖ్యల పైన టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందించారు. చిరంజీవి నిజాలు మాట్లాడితే వైసీపీ వాళ్లు రోడ్లపైకి వచ్చి వీరంగం ఆడుతున్నారని విమర్శించారు. సినిమా పరిశ్రమపై రాజకీయాలు చేయొద్దనటం కూడా నేరమేనా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు డాన్సులు చేసింది నిజం కాదా..
జరిగిందే సినిమాలో చూపించినందుకు విమర్శలు చేస్తున్నారన్నారు. తనను, చంద్రబాబు, పవన్ ను విమర్శిస్తూ కట్టు కధలతో సినిమాలు తీసినప్పుడు ఈ వైసీపీ వాళ్లకు విలువలు గుర్తుకు రాలేదా అని లోకేశ్ నిలదీసారు. చిరంజీవి లక్ష్యంగా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సమయంలో మద్దతుగా టీడీపీ నేతలు ముందుకు రావటంతో రాజకీయంగా ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటోంది.

టికెట్ల నిర్ణయంపై ఉత్కంఠ:ఇదే సమయంలో భోళా శంకర్ సినిమా టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వానికి అభ్యర్ధన అందింది. దీని పైన ఏపీ ప్రభుత్వం పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. ఏపీలో 20 శాతం చిత్రీకరణ, హీరో, హీరోయిన్ రెమ్యునరేషన్ కాకుండా రూ 100 కోట్ల బడ్జెట్ వ్యయం వంటి వివరాలు ఈ దరఖాస్తుకు జత చేయలేదని, వాటి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచంచింది. వీటిని ఇచ్చిన తరువాత పరిశీలించి టికెట్ ధరల పెంపుకు అనుమతి పైన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. రేపు భోళా శంకర్ విడుదల కానుండటంతో ప్రభుత్వం నిర్ణయం పైన తాజా పరిణామాల నేపథ్యంలో ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications