కెటిఆర్‌తో పోలికా, జగన్‌లా బలి చేయాలా: నారా లోకేష్, నాన్న కాళ్లకు మొక్కి...
తనను కెటిఆర్‌తో పోల్చుకోవడం లేదని, ఎవరైనా పోల్చుకుంటే వారి ఇష్టమని నారా లోకేష్ అన్నారు. జగన్ మాదరిగా మరొకరిని బలి చేయదలుచుకోలేదని అన్నారు.
అమరావతి: తనను తెలంగాణ మంత్రి కెటి రామారావుతో పోల్చుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన తర్వాత సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్ తన కన్నా పదేళ్లు సీనియర్ అని చెబుతూ ఆయనతో తాను ఎలా పోల్చుకుంటానని ప్రశ్నించారు. ఒకవేళ మీరలా పోల్చుకుంటే మీ ఇష్టమని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. తనకిచ్చిన ఈ పదవిని బాధ్యతగానే భావిస్తున్నానని చెప్పారు.

నేరుగా ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీగా పోటీ చేయడంపై వస్తున్న విమర్శలను ప్రస్తావించగా తనను జగన్ మాదిరిగా మరొకరిని బలిచేసి పోటీ చేయమంటారా అని ప్రశ్నించారు. తాను 2012 నుంచే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని, తనకు ఈ పదవి ఇచ్చినందుకు కార్యకర్తలు, నాయకత్వానికి శిరసువంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.
మొట్ట మొదటిసారిగా చట్టసభలో అడుగుపెట్టబోతున్న నారా లోకేశ్ తన తండ్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నారు. నామినేషన్ దాఖలుకు బయలుదేరే ముందు ఇంట్లో తన తండ్రి కాళ్లకు నమస్కరించారు. కుమారుడికి చంద్రబాబు 'గుడ్ లక్' చెప్పారు.
ఆ తర్వాత లోకేశ్ తన తల్లి భువనేశ్వరికి ఫోన్ చేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. సతీమణి బ్రహ్మణి ఆయనకు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. మామ బాలకృష్ణకు ఫోన్ చేసి తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. దీంతో బాలకృష్ణ స్వయంగా లోకేశ్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications