మరో రెండు కేసుల్లో బెయిల్ కోరిన నారా లోకేష్- మధ్యాహ్నం హైకోర్టు విచారణ..!
ఏపీలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో హైకోర్టును ముందస్తు బెయిల్ కోరిన టీడీపీ నేత నారా లోకేష్ కు ఇవాళ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో లోకేష్ కు బెయిల్ ఇవ్వని హైకోర్టు.. సీఐడి విచారణకు సహకరించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు ఢిల్లీలో ఉన్న ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చేందుకు బయలుదేరి వెళ్లారు. అదే సమయంలో ఆయన హైకోర్టులో మరో రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంతో పాటు ఏపీ ఫైబర్ నెట్ అక్రమాల కేసుల్లోనూ నారా లోకేష్ ను అరెస్టు చేసి జైలుకు పంపేందుకు సీఐడీ సిద్దమవుతోంది. స్కిల్ స్కాంతో పాటు ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో లోకేష్ పాత్ర ఉందని గతంలోనే సీఐడీ ఛీఫ్ సంజయ్ వెల్లడించారు. ఈ కేసుల్లో ఆయన సన్నిహితుడు కిలారు రాజేష్ సాయంతో అక్రమాలకు పాల్పడ్డారని ప్రకటించారు. ఆ తర్వాత రాజేష్ విదేశాలకు పారిపోవడంతో ఇదే సాకుగా లోకేష్ ను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆయా కేసుల్లో లోకేష్ అరెస్టుకు సీఐడీ అడుగులేస్తోంది.

దీంతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఉత్తర్వుల తర్వాత ఆయన స్కిల్ స్కాంతో పాటు ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై అత్యవసర విచారణ జరపాలని ఆయన హైకోర్టును కోరారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపి తీర్పు ప్రకటించే అవకాశముంది. ఈ రెండు కేసుల్లోనూ ఆయనకు ముందస్తు బెయిల్ లభించకపోతే మాత్రం సీఐడీ అరెస్టు చేసేందుకు మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ కు 41ఏ నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ అధికారులు.. స్కిల్ స్కాం, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పై హైకోర్టులో నిర్ణయం తమకు అనుకూలంగా వస్తే అరెస్టుకు మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే లోకేష్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications