మహానాడు వేదికగా కేసీఆర్, జగన్‌పై లోకేష్: నన్ను చూసి మోడీ ప్రారంభించారు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన బీమా పథకాన్ని చూసి ఇక్కడి తెరాస కాపీ కొట్టిందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చతికిలపడిందని ఆ పార్టీ యువనేత నారా లోకేష్ బుధవారం అన్నారు. మహానాడు వేదికగా ఆయన తొలిసారి మాట్లాడారు.
కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని గత ఏడాది ప్రతిపాదన పెట్టామని, అప్పుడు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు కార్యకర్తల సంక్షేమం కోసం ఓ విభాగమే ఏర్పాటు చేయాలని సూచించారన్నారు. తాను పదకొండు నెలల్లో యాభై వేల మంది కార్యకర్తలను కలిశానని చెప్పారు.
తనకు ఆ సమయంలో 14వేల అర్జీలు వచ్చాయన్నారు. అందులో 9వేల అర్జీలను పరిష్కరించామన్నారు. కార్యకర్తలు, వారి పిల్లల సంక్షేమమే ముఖ్యమన్నారు. జాబ్ ఫెయిర్‌లు పెట్టి 450 మంది ఉద్యోగులకు ఉద్యోగ ఇప్పించామన్నారు.
ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కార్యకర్తల పిల్లలకు అండగా నిలబడ్డామన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదివించలేకపోతున్న కార్యకర్తల పిల్లలకు టీడీపీ విద్యను చెప్పిస్తోందన్నారు. మరికొన్ని దరఖాస్తులు తన వద్ద ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామన్నారు.

తెరాస, వైసీపీలపై ఆగ్రహం
మనలను చూసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాద బీమా పథకాన్ని పెట్టారన్నారు. మన పథకాల ఆధారంగా కేంద్రం పలు పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. ప్రమాద బీమాను మనమే ప్రవేశ పెట్టామన్నారు. దానిని చూసి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాపీ కొట్టి ప్రవేశ పెట్టిందన్నారు. అటు వైసీపీ చేయలేకపోయిందన్నారు.
చల్లపల్లిలో ఓ ఎన్టీఆర్ మోడల్ స్కూల్ స్థాపించబోతున్నామన్నారు. వరంగల్ నగరంలోను ఓ మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. మృతి చెందిన కార్యకర్తల పిల్లలను తాము తప్పకుండా ఆదుకుంటామని చెప్పారు.
తెలంగాణ కార్యకర్తలు చెప్పండి
టీడీపీ 54 లక్షల కార్యకర్తల సభ్యత్వం ప్రకటించాక.. పలు పార్టీలు మన వెనుక నడిచాయన్నారు. కొందరు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కార్యకర్తలు ఈ విషయం చెప్పాలని అన్నారు. తెలంగాణలో ఓ పార్టీ సభ్యత్వం గురించి కాకిలెక్కలు చెబుతోందని తెరాసను ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications