నరసాపురంలో వందేభారత్ ప్రారంభం..! కేంద్రమంత్రి, ఎమ్మెల్యేల ప్రయాణం..!
ఏపీలోని విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్ వరకూ రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ రైలును తాజాగా పొడిగించారు. విజయవాడకు బదులుగా నరసాపురం నుంచి చెన్నైకు రాకపోకలు సాగించే విధంగా మార్పు చేసారు. ఇలా మార్పు చేసిన తాజా వందే భారత్ రైలును ఇవాళ నరసాపురంలో స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ ఇవాళ అట్టహాసంగా ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన పలువురు ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజాగా పొడిగించిన వందే భారత్ రైలు ప్రారంభోత్సవం నరసాపురంలో అట్టహాసంగా జరిగింది. ఇందులో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, ప్రభుత్వ విప్ నాయకర్ తో కలిసి నరసాపురం-చెన్నై సెంట్రల్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందే కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం రైలు ప్రారంభోత్సవ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు, నరసాపురం ఎమ్మెల్యే నాయకర్, మాజీ మంత్రులు కనుమూరి బాపిరాజు, పీతల సుజాత, గుడివాడ ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఇతర రాజకీయ ప్రముఖులతో కలిసి నర్సాపూర్ నుండి గుడివాడ వరకు వందేభారత్ రైలులో ప్రయాణించారు.

వారంలో మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు ప్రయాణించే ఈ రైలుకు జనవరి 11వ తేదీ వరకూ వర్తించేలా తాత్కాలిక షెడ్యూల్ ఇచ్చారు. దీని ప్రకారం ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ నరసాపురంలో మధ్యాహ్నం 2.50కి బయలుదేరి రాత్రి 11.45కు చెన్నై సెంట్రల్ స్టేషన్ కు చేరుతుంది. అలాగే చెన్నై సెంట్రల్ లో ఉదయం 5.30కి బయలుదేరే వందేభారత్.. నరసాపురానికి మధ్యాహ్నం 2.10కి చేరుకుంటుంది. ఇందులో 530 మంది ప్రయాణికులు ప్రయాణించే వీలుంది.












Click it and Unblock the Notifications