నారాయణ మాట: కాపుల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారా?
విజయవాడ: కాపుల మధ్య వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిచ్చుపెడుతున్నారా? అవుననే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఈ నెల 31వ తేదీన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు గర్జనను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారాయణ వైయస్ జగన్‌ను విమర్శిస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రమే కాకుండా కాంగ్రెసు పార్టీ కూడా ఆ ప్రయత్నం చేస్తోందని ఆయన అంటున్నారు. అధికారంలో ఉన్నంత కాలం కాపుల గురించి కనీసం నోరెత్తని పార్టీలు ఇప్పుడు వారి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.
రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకునేందుకు తల్లీపిల్ల కాంగ్రెసు పార్టీలు కుట్రలను నమ్మి మోసపోయే స్థితిలో కాపులు లేరని ఆయన అన్నారు. ఈ పార్టీలు తమ కుట్రలను మానుకుంటే మంచిందని ఆయన హితవు చెప్పారు.

2009 ఎన్నికలకు ముందు తొమ్మిది కులాలను బీసీల్లో చేర్చిన వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాపులను ఎందుకు చేర్చలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 30ని వైయస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ఎందుకు ముందుకు తీసుగకుని వెళ్లలేదని ఆయన అడిగారు.
కాపుల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని తల్లి కాంగ్రెసు (కాంగ్రెసు), పిల్ల కాంగ్రెసు (వైయస్సార్ కాంగ్రెసు) పార్టీలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications