లోకసభకు రావాలి: జెపిపై మోడీ, నా కోసం పవన్..: జెపి
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి జయప్రకాశ్ నారాయణలు పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా మోడీ బేగంపేట విమానాశ్రయంలో దిగినప్పుడు జెపి భేటీ అయ్యారు.
హెలికాప్టర్ దిగిన మోడీ... నేరుగా వచ్చి జెపిని పలకరించారు. ఈ సందర్భంగా మీరు నా మనిషి అని, మీ అవసరం దేశానికి చాలా ఉందని, దేశంలో సంస్కరణలను అమలు చేయాలంటే మీలాంటి వారు లోకసభలో ఉండాలని జెపితో మోడీ వ్యాఖ్యానించారు. కాగా, టిడిపితో పొత్తు నేపథ్యంలో బిజెపి టిడిపి అభ్యర్థికి మద్దతు పలికే అవకాశముంది.

మోడీతో భేటీ అనంతరం జెపి మాట్లాడారు. పదేళ్లు పాలించిన యూపిఏ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేసిందన్నారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపే సత్తా మోడీకి మాత్రమే ఉందన్నారు. యూపిఏ పాలనలో దేశం అస్తవ్యస్తంగా మారిందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత రాబోయే ప్రభుత్వంపై ఉందన్నారు.
టిడిపి, బిజెపి పొత్తు ఉన్నందున మోడీ సభకు వెళ్లడం లేదన్నారు. టిక్కెట్ల కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్న ఈ రోజుల్లో జెపి పోటీ చేస్తున్నందున తాను పోటీ చేయడం లేదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఆయన తన తరఫున ప్రచారానికి కూడా వస్తారన్నారు. ప్రముఖ దర్శకులు రాజమౌళి వంటి వారు కూడా సహకరించారన్నారు. ఎలాంటి వ్యక్తిని లోకసభకు పంపించాలో మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజలకు తెలుసునని చెప్పారు.












Click it and Unblock the Notifications