మోడీపై పవన్ ప్రశంస: చిరు ఆగ్రహం, చేదు అనుభవం
హైదరాబాద్/విశాఖ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మద్దతిస్తూ.... ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతుండగా.. ఆయన అన్న, కేంద్రపర్యాటక శాఖ మంత్రి చిరంజీవి మాత్రం నిప్పులు చెరుగుతున్నారు. మోడీ దేశానికి ప్రమాదకరమని విశాఖలో చిరంజీవి అన్నారు.
ప్రచారంలో భాగంగా మంగళవారం చిరంజీవి విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. లౌకికవాద భారత దేశానికి మోడీ ప్రమాదకరమన్నారు. ఇప్పటి వరకు ఆయన గోద్రా అల్లర్ల పైన ఆయన సరిగా స్పందించలేదని అభిప్రాయపడ్డారు. మోడీయే ఆ అల్లర్లకు బాధ్యత వహించాలన్నారు. అలాంటి వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా బిజెపి ఎలా ప్రకటిస్తుందన్నారు. మోడీ ప్రధాని అయితే దేశానికి మంచిది కాదన్నారు.

బిజెపిలో వాజపేయి - అద్వానీ కాలం పోయి.. ఇప్పుడు మోడీ - అదానీ కాలం వచ్చిందన్నారు. బిజెపి కార్పోరేట్ రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు.
చిరంజీవి టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల పైన కూడా నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు గజిని అన్నారు. ఆయన గతం మర్చిపోతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటి వరకు పొత్తు లేకుండా పోటీ చేసిన దాఖలాలు లేవన్నారు. అమలు కానీ, అబద్దపు హామీలు ఇస్తున్నారన్నారు.
చిరుకు సెగ
చిరంజీవికి అసంతప్తుల సెగ తగిలింది. గాజువాక అసెంబ్లీ అభ్యర్థిని స్థానికులకు కాకుండా వేరే వారికి ఇచ్చారని పలువురు కార్యకర్తలు చిరును అడ్డుకున్నారు. ఆయనకు నినాదాలు చేశారు. ఇక్కడ చిరంజీవి దాదాపు ఇరవై నిమిషాలు మాట్లాడారు. కార్యకర్తలు అంతసేపు ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.












Click it and Unblock the Notifications