గౌతమ్ రెడ్డి మృతితో విషాద ఛాయలు-సచివాలయం, అసెంబ్లీపై జాతీయ జెండా అవనతం
ఏపీలో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఆకస్మిక మరణంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సంతాప సందేశాలు పంపుతున్నారు. మేకపాటి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం రెండు రోజుల పాటు అధికారికంగా సంతాప దినాలు ప్రకటించింది. ఈ రెండు రోజుల పాటు అన్ని అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసింది.
Recommended Video

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో రాజధాని అమరావతిలోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి. నిత్యం ఆయన కార్యకలాపాలు నిర్వహించే అధికారిక కార్యాలయంతో పాటు పేషీలోనూ విషాదం నిండిపోయింది. రాష్ట్రమంత్రి మృతికి సంతాప సూచకంగా అమరావతి సచివాలయం మొదటి బ్లాకు ముఖ్యమంత్రి కార్యాలయంపై జాతీయ జెండాను అవనతం చేశారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీ భవనంపై జాతీయ జెండాను అవనతం చేశారు. మంత్రి ఆకస్మిక మరణంతో ఆయనతో కలిసి పనిచేసిన సిబ్బంది, అదికారులు షాక్ కు గురయ్యారు. మంత్రి తమతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండే వారని గుర్తుచేసుకుంటున్నారు.

తొలిసారి రాష్ట్రమంత్రిగా పనిచేస్తున్నా, సీఎం జగన్ కు సన్నిహితుడైనా ఎప్పుడూ మేకపాటి గౌతం రెడ్డి అధికార దర్పం ప్రదర్శించలేదని ఆయనతో పనిచేసిన వారు గుర్తుచేసుకుంటున్నారు. తన పేషీలో ఉన్న సిబ్బంది అందరినీ ఆప్యాయంగా ఏమయ్యా అంటూ పలకరించే వారని చెప్తున్నారు. కారు డ్రైవర్ నూ, తన కింద పనిచేసే అత్యున్నత స్ధాయి అదికారుల్ని సైతం ఎంతో గౌరవించే వారని, ఎప్పుడూ రాజకీయాలు, విమర్శల జోలికి కూడా వెళ్లని మంత్రి అని, అడిగిన వారికి కాదనకుండా సాయం చేసే మనస్తత్వమని వారు గుర్తుచేస్తున్నారు. తమ మంత్రి ఆకస్మిక మృతితో వారంతా విషాదంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications