
జగన్ సర్కార్ కు ఎస్సీ కమిషన్ నోటీసులు-పరిహారమివ్వకుండా పోలవరం గ్రామాల ఖాళీపై
ఏపీలో ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. పోలవరం నిర్మాణం సందర్భంగా అక్కడి గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించే విషయంలో జరుగుతున్న ఆలస్యంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. తాజాగా పోలవరం గ్రామాల్ని ఖాళీ చేయించడంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కూనవరం, వీఆర్ పురం మండల్లాలోని గ్రామాల్ని ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయిస్తోంది. దీనిపై మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్సీ కమిషన్... ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి నోటీసులు పంపింది.

పోలవరం ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని షెడ్యూల్ జాతుల్ని బలవంతంగా ఖాళీ చేయించడంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఏపీ ప్రభుత్వం నివేదిక కోరింది. 15 రోజుల్లోగా ప్రభుత్వం దీనిపై నివేదిక ఇవ్వాలని కోరింది. తాజాగా పోలవరం ప్రాజెక్టు సందర్శించిన సీఎం జగన్ పునరావాసం కల్పించే విషయంలో ప్రభుత్వం రాజీ పడదని తేల్చిచెప్పారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా పునరావాసానికి అవసరమైన నిధులు ఇస్తామని ప్రకటించారు.