మోసం చేశారు, హైదరాబాద్‌ను నేనే ప్రపంచ పటంలో పెట్టాను: చంద్రబాబు
కర్నూలు: కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హేతుబద్దత లేకుండా కాంగ్రెస్ పార్టీ విభజన చేసిందన్నారు. విభజన తర్వాత ఇప్పుడు బీజేపీ నమ్మకద్రోహం చేసిందన్నారు. నమ్మకద్రోహంతో నవ్యాంధ్రను ముంచిందన్నారు.
కర్నూలు జిల్లా జొన్నగిరిలో నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు. వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ దీక్షలో భాగంగా రెండో రోజైన ఆదివారం నీటి భద్రత-కరవు రహిత రాష్ట్రం అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది తానే అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం మొత్తం నవ నిర్మాణ దీక్ష చేపట్టామన్నారు. ఏపీకి అన్యాయం చేసిన వారు అసూయతో కుళ్లుకునేలా అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాలో 68 చెరువులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అధికారంలోకి రాగానే కరెంటు కొరత లేకుండా చేశామన్నారు.
చంద్రబాబు జొన్నగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామసభలో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.52వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని చెప్పారు.
పంట సంజీవని కింద 7.25 లక్షల పంట కుంటలు తవ్వామని చెప్పారు. ఉపాధి హామీ, జలవనరులశాఖలు సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. పోలవరం పనులు 55 శాతం మేర పూర్తయ్యాయన్నారు. ఎవరు అడ్డుపడ్డా పోలవరం ఆగదన్నారు. నిధులు ఇస్తే 2019 డిసెంబర్ లోపు పోలవరం పూర్తి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications