నాగశ్రీనును అవమానించారు: మంచు మోహన్ బాబు, విష్ణుపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు, హీరో మంచు విష్ణు తీరుపై నాయీ బ్రాహ్మణ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మోహన్ బాబు దగ్గర పనిచేసే నాగ శ్రీను వ్యవహారంలో మోహన్ బాబు, ఆయన కుమారుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుపై నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు మండిపడుతున్నారు.
కర్నూలులోని మానవహక్కుల కమిషన్‌లో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించారని మోహన్ బాబు పై ఆయన కుమారుడి పై మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు. తమ వద్ద పనిచేసిన హెయిర్ స్టైలిస్ట్ నాగశీనుపై ఉద్దేశపూర్వకంగానే చోరీ కేసు నమోదు చేశారన్న ఆరోపణలు మంచు ఫ్యామిలీపై ఉన్నాయి. ఈ ఆరోపణలపై వివాదం రాజుకుంది.

తనను చిత్రహింసలకు గురి చేసి, కులం పేరుతో దూషించారని నాగశీను ఆవేదన వ్యక్త చేశాడు. దీంతో మంచు ఫ్యామిలీపై నాయీ బ్రాహ్మణులు మండిపడుతున్నారు. మోహన్‌బాబు కుటుంబం తమ మనోభావాలను దెబ్బ తీసిందని, తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక, గుంటూరు, ఒంగోలులో ఆందోళన చేశారు. మంచు ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
మరోవైపు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మోహన్ బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు, అధికార బలం ఉందన్న అహంకారంతో, నాగశ్రీనుని కులం పేరుతో దూషించడాన్ని ఖండించారు. మోహన్‌బాబు క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
ఎన్నో ఏళ్ల పాటు మంచు ఫ్యామిలీ దగ్గర పనిచేస్తే.. తనపై దొంగతనం కేసు పెట్టి, మానసికంగా వేధించారని నాగశ్రీను ఆరోపించారు. మోహన్ బాబు తనను మోకాళ్లపై నిలబెట్టి అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోహన్ బాబు, అతడి కుమారుడు మంచు విష్ణు నాయీ బ్రాహ్మణులకు, బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, వారిద్దరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications