'రేవంత్ ఇష్యూతో పెనుమార్పులు, ఏసీబీ వద్ద బాబు ఫోన్ రికార్డ్‌లు'
వరంగల్: లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారం నేపథ్యంలో రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు.
ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఫోన్ సంభాషణలు ఏసీబీ అధికారుల వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
ప్రధాన సూత్రధారి చంద్రబాబు సూచన మేరకే రేవంత్ బేరం ఆడారన్నారు. రేవంత్ వ్యవహారంతో రాష్ట్ర రాజకీయాలు తారుమారు అవుతాయన్నారు. త్వరలో అన్ని ఆధారాలు బయటపెడతామన్నారు.

జగన్, కేసీఆర్‌లపై సోమిరెడ్డి ధ్వజం
తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కుమ్మక్కైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సీమాంధ్ర ద్రోహి అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా ఆరోపించారు.
13 కేసులలో నిందితుడైన జగన్‌కు గవర్నర్ అపాయింటుమెంట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణను కేసీఆర్ నాశనం చేస్తున్నాడన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విపక్షాలు లేకుండా చేయాలనేది కేసీఆర్ కుట్ర అన్నారు.
రేవంత్ రెడ్డి వ్యవహారంలో తమ అధినేత చంద్రబాబును ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. టీఆర్ఎస్, వైసీపీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. రెండు పార్టీల అధినేతలదీ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమే అన్నారు. అవినీతికి కేరాఫ్‌గా మారిన జగన్ తమ పైన విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
జగన్‌కు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగే హక్కు లేదన్నారు. తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పి అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడం లేదన్నారు. కుటుంబ ఆశ్తులు పెంచుకునేందుకు కేసీఆర్ పథకాలు ప్రవేశ పెడుతున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా టీడీపీని ఏం చేయలేరన్నారు.












Click it and Unblock the Notifications