చంద్రబాబు, పవన్ టార్గెట్ పెద్దిరెడ్డి అండ్ సన్ - జగన్ లెక్క ఏంటి..!?
ఏపీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మూడు పార్టీల ఎన్డీఏ కూటమి జగన్ ఓటమే లక్ష్యంగా పని చేస్తోంది. జగన్ ను దెబ్బ తీయాలంటే ముందు ఆయనకు మద్దతు ఉన్న బలమైన నేతల పైన కూటమి నేతలు ఫోకస్ చేసారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కు టార్గెట్ అయ్యారు. చంద్రబాబు లక్ష్యంగా పెద్దిరెడ్డి, పవన్ ఓటమి కోసం మిథున్ రెడ్డి పని చేస్తున్నారు. దీంతో, ఇటు కూటమి..అటు ఈ ఇద్దరి కోసం జగన్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.
కీలక బాధ్యతలు
వైసీపీలో జగన్ ఎన్నికల బాధ్యతలను పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీమలో కీలక జిల్లాల బాధ్యతలను చూస్తున్నారు. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, బాలయ్య పోటీ చేస్తున్న హిందూపురంలో తొలి నుంచి అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో మిథున్ రెడ్డి గోదావరి జిల్లాల పార్టీ ఇంఛార్జ్ గా ఉన్నారు. ఇప్పుడు పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సమయం లో అక్కడ పార్టీలో చేరికలు, పోల్ మేనేజ్ మెంట్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో..ఇప్పుడు చంద్రబాబు పదే పదే మంత్రిపెద్దిరెడ్డి, పవన్ తాజాగా పిఠాపురంలో మిథున్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇక, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వర్సస్ నల్లారి మధ్య పోరు ఇప్పుడు రాజంపేట పార్లమెంట్ పరిధిలో ప్రత్యక్ష పోరుగా మారింది.

ఆ ఇద్దరిని దెబ్బ తీస్తే
చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు పెద్దిరెడ్డి, నల్లారి కాంగ్రెస్ లోనే ఉన్నా తొలి నుంచి కోల్డ్ వార్ ఉంది. ఈ ఇద్దరితో చంద్రబాబుకు రాజకీయ వైరం ఉంది. కానీ, ఇప్పుడు మాజీ సీఎం కిరణ్ బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్ది, కిరణ్ సోదరుడు కిశోర్ టీడీపీ నుంచి పీలేరు ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. రాజంపేట నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన మిథున్ రెడ్డి వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. కిరణ్ సీఎం అయిన వెంటనే జగన్ కాంగ్రెస్ కు రాజీనామా చేసారు. కడప ఎంపీ ఉప ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేసారు. జగన్, పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఇప్పుడు కిరణ్ బీజేపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పుడు కిరణ్ కోసం చంద్రబాబు ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు పిఠాపురంలో ప్రత్యర్ధి పార్టీ నేతలను వైసీపీలోకి తీసుకురావటంలో మిథున్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

హోరా హోరీగా
మిథున్ రెడ్డిని రాజంపేటకే పరిమితం చేసేలా చంద్రబాబు, పవన్, కిరణ్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఆర్దిక, అంగ బలం ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిని ఎన్నికల్లో జిల్లాకే పరిమితం చేస్తే వైసీపీని సీమ, గోదావరి జిల్లాల్లో ఎదుర్కోవటంలో సహకరిస్తుందని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడిస్తానని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. కిరణ్ సైతం తన ప్రచారంలో పెద్దిరెడ్డి కుటుంబం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ, జగన్ మాత్రం రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి బలం పైన విశ్వాసంతో ఉన్నారు. వారిద్దరు గెలవటంతో పాటుగా పార్టీని ఆ ఇద్దరు ఇంఛార్జ్ లు గా ఉన్న ప్రాంతాల్లో గెలిచేలా పని చేస్తారని నమ్మకంతో కనిపిస్తున్నారు. దీంతో..ఈ ఇద్దరు జగన్ నమ్మకాన్ని ఏ మేర నిలబెట్టుకుంటారు..కూటమిని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications