పవన్ పిలుపు ఎఫెక్ట్ - జగన్ తిరుమల టూర్ పై కూటమి కీలక నిర్ణయం..!
ఏపీలో తిరుమల లడ్డూ వివాదం రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల టూర్ కు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం తిరుమల చేరుకోనున్న జగన్.. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం స్వామి వారిని దర్శించుకోనున్నారు. అయితే లడ్డూ వివాదం నేపథ్యంలో జగన్ టూర్ ను అడ్డుకోవాలని కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు రెండు రోజులుగా వరుసగా పిలుపునిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించారు.

తిరుమల స్వామి వారి దర్శనం కోసం హిందూ మతంపై విశ్వాసం ఉందని జగన్ డిక్లరేషన్ ఇస్తేనే అనుమతిస్తామని అటు టీటీడీ చెప్తుండగా.. ఇటు కూటమి పార్టీల నేతలు కూడా డిక్లరేషన్ ఇవ్వకుంటే అడ్డుకుని తీరతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ వ్యవహారంపై కూటమి నేతలు మాట్లాడొద్దని సూచించారు. దాన్ని టీటీడీయే చూసుకుంటుందన్నారు. నిన్న రాత్రి ఈ మేరకు పవన్ ప్రకటన విడుదల చేశారు.
ఈ నేపథ్యంలోనే కూటమి పార్టీలు ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నాయి. జగన్ తిరుమల టూర్ ను అడ్డుకోరాదని కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నిర్ణయం తీసుకున్నాయి. దానికి బదులు కేవలం జగన్ వచ్చే దారిలో శాంతియుతంగా నిరసన తెలపాలని కూడా నిర్ణయించాయి. దీంతో జగన్ తిరుమల టూర్ కు అడ్డంకులు దాదాపుగా తొలగిపోయినట్లే భావిస్తున్నారు. మరోవైపు జగన్ తిరుమల దర్శనం కోసం డిక్లరేషన్ ఇస్తారా లేదా అన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. డిక్లరేషన్ పై సంతకం పెడితేనే జగన్ ను అనుమతిస్తామని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది.
మరోవైపు జగన్ ను తిరుమలలో అడ్డుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న హెచ్చరికలతోనే కూటమి పార్టీలు దీనిపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఓవైపు టీటీడీని స్వతంత్ర సంస్థగా చెప్పుకుంటూ మరోవైపు జగన్ ను అడ్డుకుంటే ప్రభుత్వమే రాజకీయ కక్షతో ఇదంతా చేయిస్తుందన్న సంకేతాలు వెళ్తాయని అధికార కూటమి భావించినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ టూర్ ను అడ్డుకోవద్దని నేతలకు ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications