ఏపీలో కొత్త పథకాన్ని ప్రకటించిన 'నెక్'
ఏపీలో అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల కాలంలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హామీల అమలుపై దృష్టిసారించారు. గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించాలంటే అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని పయనింప చేయడం ఒక్కటే మార్గమని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రానికి ఎక్కువగా పెట్టుబడులు తీసుకురాగలిగితే అభివృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన జరుగుతుందని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే దిశగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు.
నైపుణ్య గణనపైనే సంతకం
అధికారం చేపట్టిన వెంటనే నైపుణ్య గణనపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? వారికి ఉద్యోగాలు కల్పించాలంటే నైపుణ్యాన్ని పెంచడం ఎలా? అనేదానిపై ఈ గణన జరుగుతుంది. తాజాగా ప్రభుత్వానికి బాసటగా ఉండేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం(NECC) ఉద్యోగాల కల్పన చేయబోతోంది.

ఒక్కో బండికి ముగ్గురు
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాకు 100 మంది చొప్పున 26 జిల్లాల నుంచి 2,600 మందిని ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరికి రూ.50వేల విలువైన వంట పాత్రలు, స్టూల్, ఇతర పరికరాలతో ఎగ్ కార్ట్ (తోపుడు బండి)ను అందిస్తారు. ఒక్కో బండివల్ల ముగ్గురికి ప్రయోజనం కలుగుతుందని, తద్వారా మొత్తం 7200 మంది లాభపడతారని చెప్పారు. ఈ ఎగ్‌కార్ట్‌లకు రూ.13 కోట్లు అందించేందుకు ఎన్ఈసీసీ ఛైర్‌పర్సన్ అనూరాధ జే దేశాయ్ ఆమోదం తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు వెల్లడించారు. రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ను కలిసి వీరంతా ఈ విషయాన్ని తెలిపారు. అలాగే సమస్యలను కూడా ప్రస్తావించగా, వాటిని పరిష్కరిస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసినవారిలో కేవీ సుబ్బారావు, పడాల సుబ్బారెడ్డి, చిట్టూరి సురేశ్‌రాయుడు, పి.ప్రణీత్, వి.రమేశ్ బాబు తదితరులున్నారు.












Click it and Unblock the Notifications