బంగాళాఖాతంలో అల్పపీడనం దెబ్బ- ఏపీలో అత్యధిక వర్షపాతం
Bay of Bengal: బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంగా బలహీనపడింది. దీని ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో వచ్చే 48 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం దెబ్బకు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.
బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో కొద్దిరోజుల కిందట ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిన విషయం తెలిసిందే. సముద్రతలం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు- మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ఈ సైక్లోన్ సర్క్యుట్ క్రమంగా తమిళనాడు దక్షిణ తీర ప్రాంతం, పుదుచ్చేరి, శ్రీలంక వైపు కదులింది.

దీని ప్రభావంతో బుధ, గురు వారాల్లో ఏపీలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అధిక వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలో దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలపై అల్పపీడన ప్రభాం అధికంగా కనిపించింది.
నెల్లూరు జిల్లాలోని కావలి, తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటల్లో అయిదు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు సిటీలో నాలుగు సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. కందుకూరు, గూడూరుల్లో మూడు సెంటీమీటర్లు, కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో రెండు, రాయలసీమలోని పలు జిల్లాల్లో ఒక సెంటీమీటర్ మేర వర్షం పడింది.
ఇదే తీవ్రత నేడు, రేపు ఉండొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిస్తుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. నెల్లూరు జిల్లాలకు ఆనుకుని ఉన్న తమిళనాడులోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications