పొత్తు ధర్మంపై టీడీపీని నిలదీసిన పవన్ - మరి బీజేపీతో చేసిందేంటి..!!
ఏపీలో ఎన్నికల వేళ పొత్తులో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. చంద్రబాబు మిత్ర ధర్మం పాటించటం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పొత్తు వేళ ఏకపక్షంగా సీట్ల ప్రకటన పైన పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను రెండు సీట్లు ప్రకటించారు. లోకేష్ సీఎం సీటు షేరింగ్ గురించి చేసిన వ్యాఖ్యల పైన స్పందించారు. పొత్తు కోసమే తాను అన్నీ భరిస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే, పవన్ చేసిన పొత్తు ధర్మం పైన సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
మిత్రపక్షంగా ఉంటూ టీడీపీ సీట్లు ప్రకటించటాన్ని పవన్ తప్పు బట్టారు. పొత్తు ధర్మం గురించి ప్రశ్నించారు. తాము సింగిల్ గా పోటీ చేస్తే సీట్లు వస్తాయి కానీ, అధికారం రాదని పేర్కొన్నారు. చంద్రబాబు రెండు సీట్లను ప్రకటించటంతో తాను, తప్పని పరిస్థితుల్లో రాజానగరం, రాజోలు సీట్లను ప్రకటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పొత్తు ధర్మం గురించి పవన్ మాట్లాడటం పైన సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. జనసేన ప్రస్తుతం ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉంది. బీజేపీతో పొత్తు కొనసాగుతోంది. మరి బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే టీడీపీతో ఎలా ఏకపక్షంగా పొత్తు ప్రకటిస్తారు..అది పొత్తు ధర్మంకు విరుద్దం కాదా అంటూ సోషల్ మీడియా లో పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి.

ఒక జాతీయ పార్టీతో పొత్తులో ఉండి..జైలులో చంద్రబాబును చూసిన వెంటనే పొత్తు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ మిత్రపక్షమని చెబుతూనే..ఏనాడు బీజేపీతో కలిసి ఒక్క కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదనే ప్రశ్నలు కనిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకోవటం పొత్తు ధర్మమేనా అని నిలదీస్తున్నారు. తాను టీడీపీతో పొత్తు ఖాయం చేసుకొని బీజేపీని కలిసి రమ్మని కోరటం పొత్తు ధర్మం అని అంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తుతో సీట్లు పంచుకొని, ఏపీలో సీట్ల కోసం టీడీపీ తో సీట్ల గురించి చర్చించటం సరైన విధానమేనా అంటూ పోస్టింగ్ దర్శనమిస్తున్నాయి.
బీజేపీ నేతలు, ప్రధాని మోదీ జనసేనానికి గౌరవం ఇచ్చినా...టీడీపీతో పొత్తు కోసం తిరిగి పవన్ వాళ్లకు అదే స్థాయిలో గౌరవం ఇస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పొత్తు ధర్మం గురించి మాట్లాడితే పవన్ వీటిన్నంటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుందనే పోస్టింగ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications