TTD కీలక నిర్ణయం.. త్వరలోనే తిరుమలలో..
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు త్వరలోనే ప్రయోగాత్మకంగా ఒక విధానాన్ని అమలు చేసి చూడబోతున్నారు. దీన్ని బట్టి భక్తుల స్పందన ఎలా ఉందో అంచనా వేసుకొని ఆ తర్వాత దానిని పొడిగించనున్నారు. భక్తులకు ప్రస్తుతం తిరుమలలో గదులను కేటాయిస్తున్నారు. త్వరలోనే తిరుపతిలో కూడా తిరుమల తరహాలో గదులను కేటాయిస్తారు. దీంతో కొండపైన గదులు దొరకని భక్తులకు కింద వసతి సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా గతంలో ఉన్న టైమ్ స్లాట్ టోకెన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. గతంలోనే ఇది ఉన్నప్పటికీ కరోనా నుంచి అన్నింటినీ టీటీడీ నిలిపివేసిన సంగతి తెలిసిందే.

త్వరలోనే టైమ్ స్లాట్ టోకెన్లు
తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు తమకు ఎదురైన సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. టైమ్ స్లాట్ పై టోకెన్లు పొందిన భక్తులు తిరుపతిలోనే బస చేసి కొండపైకి రావాల్సి ఉంటుందని, ఈ విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. రాత్రి నుంచి క్యూలైన్లలో వేచివున్న భక్తులకు సత్వరమే దర్శనం చేయించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ఉదయం 10.00 గంటలకు మార్చినట్లు ఈవో తెలిపారు.

ఇకనుంచి అన్ని స్టాల్స్ లో లడ్డూల విక్రయం
కొండపైన వివిధ ప్రాంతాల్లో సేవలందించే శ్రీవారి సేవకులు ఆయా మార్గాలను తెలుసుకునేందుకు వీలుగా క్యూ ఆర్ కోడ్‌ను రూపొందించారు. ఇది విజయవంతమవడంతో భక్తుల కోసం త్వరలోనే తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఇప్పటివరకు లడ్డూ విక్రయశాలలో కొన్ని స్టాల్స్ లోనే అమ్మకాలు సాగించడంవల్ల భక్తులు క్యూలో నిలుచోవాల్సి వస్తోంది. దీన్ని నివారించేందుకు అన్ని స్టాల్స్ లో విక్రయాలు జరపబోతున్నారు. ఒంగోలు, ఢిల్లీలో డిసెంబరు, జనవరి మాసాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించబోతున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.122.19 కోట్లు
కార్తీక మాసంలో గత ఏడాది జరిగినట్లుగానే విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు, రంపచోడవరం, అరకు, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఈనెలలోనే శ్రీనివాస కల్యాణాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.122.19 కోట్లు వచ్చింది. 98.44లక్షల లడ్డు ప్రసాదాల అమ్మకాలు జరిగాయి. 44.7లక్షల మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారు. గరుడ సేవ నాడు 3లక్షల మంది భక్తులకు వాహనసేవ దర్శనభాగ్యం కల్పించినట్లు ఈవో తెలిపారు.