ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు గుర్తింపు - 17కు చేరిన సంఖ్య : ప్రకాశం జిల్లా వ్యక్తికి నిర్దారణ..!!
ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోన్న ఒమిక్రాన్ కేసులు ఇప్పుడు భారత్ లోనూ వేగంగా వ్యాపిస్తున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య వెయ్యి దాటింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు లోకి వస్తున్నాయి. తాజాగా ఏపీలో మరో కొత్త ఓమిక్రాన్ కేసు నిర్దారణ అయింది. దీంతో..ఏపీలో ఇప్పటి వరకు నిర్దారించిన ఓమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరింది. ప్రకాశం జిల్లాలో ఈ కేసును గుర్తించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి బెంగళూరు మీదుగా ప్రకాశం జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Recommended Video

యూఏఈ నుంచి వ్యక్తిలో గుర్తింపు
విదేశాల నుంచి వివిధ మార్గాల్లో ఏపీకి చేరుకుంటున్న వారికి ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా ఏపీకి చేరుకున్న మరో 14 మంది ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 17 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో ముగ్గురికి నెగెటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, గత 24 గంటల్లో రాష్ట్రంలో 33,188 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 130 మందికి వైరస్ సోకగా..ఒకరు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఏపీలో 17కి చేరిన ఓమిక్రాన్ కేసులు
కొవిడ్ నుంచి మరో 97 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,081 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో తెలంగాణలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. నిత్యం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలో తాజాగా మరో అయిదు కొత్త ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 67కు చేరింది. కాగా, ఓమిక్రాన్ బారిన పడిన వారిలో 22 మంది కోలుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక, తెలంగాణలో తాజాగా 280 కరోనా కేసులు నిర్దారణ అయ్యాయి.

క్రమేణా పెరుగుతున్న కరోనా
రాష్ట్రంలో 24 గంటల్లో 37,926 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 280 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకి ఒకరు మృతి చెందారు. తాజాగా కొవిడ్ బారినపడిన మరో 206 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,563 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ రోజు నుంచి జనవరి 3వ తేదీ వరకు జనసమూహాల పైన ఆంక్షలు విధించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మాస్కు వినియోగం తప్పనిసరి చేసారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.












Click it and Unblock the Notifications