కొత్త రేషన్ కార్డులపై అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల ప్రకటన
Ration Cards in AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పరిపాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని విజయవంతంగా అమలు చేస్తోంది.
వివిధ రకాల సేవలు, సర్టిఫికెట్ల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన శ్రమ ఇక తప్పినట్టయింది. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పాలనాపరమైన సంస్కరణలకు చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్ తెర తీసింది. ఈ క్రమంలో జనవరి 18వ తేదీన వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించింది.

దీన్ని మరింత విస్తరించాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం వాట్సప్ ద్వారా 161 రకాల సేవలు అందుబాటులో ఉంటోన్నాయి. వీటిని 500లకు పెంచాలంటూ ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వారికి సూచనలు ఇచ్చారు.
కొత్త రేషన్ కార్డులను కూడా వాట్సప్ ద్వారానే జారీ చేస్తామంటూ గతంలో ఐటీ శాఖ మంత్ర నారా లోకేష్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులకు సూచనలు సైతం అప్పట్లోనే జారీ చేశారాయన. క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తామంటూ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను 45 రోజుల్లోనే ఈ కసరత్తు పూర్తి చేస్తామనీ అన్నారు.
ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజా ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్పష్టతనిచ్చారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన రేషన్ కార్డులను త్వరలోనే ఇవ్వబోతోన్నామని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇకేవైసీ నిబంధనలను పూర్తి చేస్తామని చెప్పారు.
ఇ-పొస్ మిషన్లతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను సైతం అమర్చుతామని, రాష్ట్రంలో ఉన్న అన్ని బఫర్ గోడౌన్లల్లో ఏఐ కెమెరాల ద్వారా నిత్యావసర సరుకుల రవాణాను పర్యవేక్షిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నిత్యావసర సరుకులన్నీ కూడా అద్భుతమైన నాణ్యతతో పంపిణీ చేస్తామని హామీ ఇఛ్చారు.
రేషన్ బియ్యం విషయంలో గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవస్థీకృత మాఫియాను నడిపించిందని నాదెండ్ల ఆరోపించారు. పీడీఎస్ బియ్యాన్ని స్మగ్లింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసమే తరలించిందని ధ్వజమెత్తారు. 76,854 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తమ కూటమి ప్రభుత్వం జప్తు చేసిందని వివరించారు.












Click it and Unblock the Notifications