ఏపీలో కొత్త ఓట్లు, తొలగింపులపై ఈసీ కీలక నిర్ణయం..!
కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేష్ కుమార్ మీనా పలు సూచనలు చేశారు. ఈసారి ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ తీసుకుంటున్న చర్యల్ని ఆయన వివరించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు.షెడ్యూల్ ప్రకారం ఏపీలో మే 13 తేదీన పోలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18 తేదీన విడుదల చేస్తామన్నారు. ఇవాళ్టి వరకూ రాష్ట్రంలో 4.09 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. తుది ఓటర్ల జాబితా నాటికి 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

కొత్త గా ఈ నెలన్నర రోజుల్లో 1.75 లక్షల మంది ఓటర్లు చేరినట్లు సీఈవో పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి కొత్త దరఖాస్తులు, తొలగింపు దరఖాస్తులు ఫ్రీజ్ చేస్తున్నామన్నారు. అయితే నోటిఫికేషన్ విడుదలకు 10 రోజుల వరకూ ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. ఏపీలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మీనా వెల్లడించారు. మరికొన్ని అత్యవసర పోలింగ్ కేంద్రాలూ పెడుతున్నామన్నారు. ఈసారి మహిళా సిబ్బంది మాత్రమే ఉన్న 179 పోలింగ్ కేంద్రాలు , యువ సిబ్బంది ఉన్న మోడల్ పోలింగ్ కేంద్రాలు 555 ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈసారి ఎన్నికల్లో ఓటు వేసే వారు ఎపిక్ కార్డుతో పాటు 12 రకాల గుర్తింపు కార్డులు వినియోగించుకోవచ్చని మీనా తెలిపారు.ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. 85ఏళ్లు నిండిన ఓటర్ లకు ఇంటి నుంచే ఓటు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. నోటిఫికేషన్ వచ్చాక రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దాన్ని పోస్టల్ బ్యాలెట్ గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంటామన్నారు. 10 రోజుల ముందే ఇంటి నుంచి ఓటు చేసేలా చర్యలు చేపడతామన్నారు.
ఈసారి అన్ లైన్ నామినేషన్ అవకాశం కల్పిస్తున్నామన్నారు. అఫిడవిట్ లో ఎలాంటి ఖాళీ లేకుండా పూర్తి చేసి ఇవ్వాల్సిందేని ఆయన తెలిపారు. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్దులు మూడు సార్లు పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సిందేనన్నారు.












Click it and Unblock the Notifications