Kesineni nani:కేశినేని ఈజ్ బ్యాక్...ఆపరేషన్ ఢిల్లీ..!!
కేశినేని నాని..పరిచయం అక్కర్లేని పేరు. విజయవాడ ఎంపీగా తనదైన ముద్ర వేశారు. టీడీపీలోనే ఉంటూ ఆ పార్టీకే చుక్కలు చూపించిన నేత. ఇక 2024 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ కండువా అలా కప్పుకున్నారో లేదో.. ఇక టీడీపీ భరతం పట్టడం ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో తన తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక ఆ తర్వాత రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. పొలిటికల్ పవర్ రుచి చూసిన వారు దాన్ని అంత తేలిగ్గా మరిచిపోలేరు. కేశినేని నాని విషయంలో కూడా అదే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా కేశినేని నాని తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు.
కేశినేని నాని ఈజ్ బ్యాక్ : విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నందిగామ, మైలవం వంటి ప్రాంతాల్లో చాలా యాక్టివ్‌గా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానని తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. కేశినేని నాని తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ అనేదానిపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది.

టీడీపీలో ఉంటూ చుక్కలు చూపిన నాని: కేశినేని నాని తన పొలిటికల్ కెరీర్‌ను టీడీపీతో ప్రారంభించారు. అయితే 2019లో విజయవాడ ఎంపీగా గెలిచిన నాని.. క్రమంగా ఆ పార్టీలోనే కొరకరాని కొయ్యగా మారారు. దీంతో టీడీపీ అధిష్టానం కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్నిని అస్త్రంగా ప్రయోగించింది. అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాజకీయ శతృత్వం పెరిగింది. ఒకానొక సమయంలో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఇక లోకేష్ ఆశీర్వాదంతో కేశినేని చిన్ని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకోగా.. కేశినేని నాని వైసీపీ కండువా కప్పుకున్నారు. అన్నదమ్ముల మధ్య పొలిటికల్ వార్ మరింత పీక్ స్టేజెస్‌కు చేరుకుంది. అంతిమంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేశినేని చిన్నిదే పై చేయి అయ్యింది.
రీఎంట్రీపై సంకేతాలు:తాజాగా కేశినేని నాని మరోసారి తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మళ్లీ పొలిటికల్‌గా నిలబడేందుకు విజయవాడ పార్లమెంటు పరిధిలోని పలు నియోజకవర్గాల్లో కలియతిరుగుతున్నారు.తన అభిమానులను కూడా యాక్టివ్ అవ్వాలని పిలుపునిస్తున్నట్లు సమాచారం. తిరువూరు,మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో తన అనుచరగణాన్ని కలుస్తూ తన రీఎంట్రీపై పరోక్ష సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం. అయతే టీడీపీలో కేశినేని నానికి డోర్స్ షట్ కావడంతో ఆయన చూపు ఇప్పుడు బీజేపీ వైపు పడింది. కేశినేని నానికి కమలం పార్టీ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. ఈ సంబంధాలను ఉపయోగించుకుని కాషాయం పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు అంతర్గత సమాచారం.
కమలం పెద్దల దీవెనలతో:కేశినేని నానికి కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే వారితో పార్టీలో చేరే విషయమై చర్చించినట్లు విజయవాడ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. కేశినేని నానిని కమలం పార్టీలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరీ కూడా హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతకు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం కోసం ఆయన బీజేపీని ఎంచుకున్నట్లు సమాచారం. అయితే కేశినేని నాని చేరికను టీడీపీ ఒప్పుకుంటుందా..లేక బ్రేకులు వేస్తుందా అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్‌గా మారింది. మొత్తానికి కేశినేని నాని బీజేపీ తీర్థం పుచ్చుకుంటే విజయవాడ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.












Click it and Unblock the Notifications