తిరుమలలో కనకదాస పీఠం: జగన్ ను కలిసిన కర్ణాటక మఠాధిపతి, బొమ్మై కేబినెట్ మంత్రి
కర్ణాటకలోని కగినెలె మఠాధిపతి నిరంజనానందపురి స్వామీజీ ఇవ్వాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఏపీ మంత్రి ఉష శ్రీచరణ్, కర్ణాటక మంత్రి ఎంబీటీ నాగరాజ్ ఆయన వెంట ఉన్నారు.
అమరావతి: కర్ణాటకలోని ప్రఖ్యాత కగినెలె కనకదాస గురుపీఠం మఠాధిపతి శ్రీనిరంజనానందపురి స్వామీజీ ఇవ్వాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆయన వెంట ఏపీ మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్, కర్ణాటక మున్సిపల్ శాఖ మంత్రి ఎంబీటీ నాగరాజ్, మాజీమంత్రి రేవణ్ణ, కర్ణాటక వెనుకబడిన తరగతుల ఫెడరేషన్ అధ్యక్షుడు బీకే రవి, నెల్లూరు జిల్లా కావలికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు.
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠాన్ని నిర్మించడానికి అవసరమైన ఒక ఎకరా భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల క్ష్రేత్రంలో తమ కురుబ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు మఠం లేదని గుర్తు చేశారు. కర్ణాటక నుంచి రోజూ తిరుమల శ్రీవారిని దర్శించుకునే వేలాదిమంది కురుబ సామాజిక వర్గ భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని వివరించారు.

శ్రీవారిని దర్శించుకోవడానికి కర్ణాటకలోని మారుమూల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తిరుమలకు తరలి వస్తుంటారని, వారి సౌకర్యం కోసం తమ గురుపీఠం తరఫున మఠాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు వివరించారు. వారికి నివాస వసతిని కల్పించడానికి కనకదాసు గురుపీఠం తరఫున మఠాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నామని నిరంజనానందపురి స్వామిజీ వివరించారు.

దీనితో పాటు కనకదాసు రచించిన కీర్తనలను శ్రీవారి భక్తులకు చేరవేయడానికీ ఇది ఉపయోగపడుతుందని అన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారి కీర్తనలను విశ్వవ్యాప్తం చేయదలిచామని, తమ గురుపీఠానికి ఉన్న చరిత్రను శ్రీవారి భక్తులకు తెలియజేయడానికి ఇదొక వేదిక అవుతుందని అన్నారు. వారు చేసిన ఈ విజ్ఞప్తి పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. కనకదాస గురుపీఠం తరఫున తిరుమలలో మఠాన్ని నిర్మించడానికి అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications