జగన్ పడిన నాలుగేళ్ల కష్టానికి తగిన ఫలితం ఇదీ..: ఇంతకంటే ఇంకేం కావాలి
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు.. అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటోన్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలల నుంచే అమలు చేస్తూ వస్తోన్న నవరత్నాలు పేదరికాన్ని రూపుమాపుతోన్నాయి. పేదలకు ఆర్థిక స్వావలంబనను కల్పిస్తోన్నాయి.
నవరత్నాలు పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు నేరుగా అర్హత గల చిట్టచివరి వ్యక్తి వరకు అందుతోండటం.. సత్ఫలితాలను ఇస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, ఆసరా, చేయూత.. వంటి పథకాల కింద ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది ప్రభుత్వం.

ఆయా పథకాల కింద వైఎస్ జగన్.. నేరుగా బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులను బదలాయిస్తోన్నారు. ఇది అంచనాలకు మించిన విధంగా సత్ఫలితాలను ఇస్తోంది. పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తోన్న జగన్ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తోంది. నాలుగు సంవత్సరాల కిందట మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు.. పేదలను ఆర్థికంగా నిలబెడుతున్నాయి.
2016లో ఏపీలో పేదరికం రేటు 11.7 శాతం ఉండగా 2021 నాటికి అది 6.06 శాతానికి తగ్గిందంటే- జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2016 నాటికి 14.72 శాతంగా నమోదైన పేదరికం- 2021 నాటికి 7.71 శాతానికి తగ్గింది.

పట్టణ ప్రాంతాల్లోనూ అదే ఫలితాలు కనిపిస్తోన్నాయి. పట్టణ పేదరిక శాతం 4.63 ఉండగా.. 2021 నాటికి అది 2.20 శాతానికి తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వెల్లడించింది. ఉచిత విద్య, వైద్యం, రైతులకు భరోసా.. పిల్లలకు పౌష్టికాహారం, గర్భిణులకు ఇచ్చే ప్రత్యేక ఆహారం వంటివి ప్రజలకి ఎంతగానో మేలు చేశాయి.
వయోధిక వృద్ధులకు ఇళ్ల వద్దకే పెన్షన్ మొత్తాన్ని అందించడం, ఇంటికే ఆరోగ్య సేవలు అందించడం వంటి చర్యలు పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రధాన కారణాలుగా మారినట్లు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రజలు సంక్షేమ రాజ్యంలో సుభిక్షంగా ఉంటూ, పోషకాహారం తీసుకుంటూ ఉన్నత జీవన ప్రమాణాల్లో పొందుతున్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications