ప్రేమించుకున్నాం, వలీతో తాడోపేడో: నీతూ అగర్వాల్
కర్నూలు: ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మస్తాన్ వలీ ఓ రియాల్టర్, నిర్మాతగానే తనకు తెలుసునని ప్రముఖ నటి, ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టై బుధవారం జైలు నుండి విడుదలైన నీతూ అగర్వాల్ అన్నారు.
ఆమె కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. మస్తాన్ వలీ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తాను తాడోపేడో తేల్చుకుంటానని చెప్పారు. అతను రియాల్టర్, నిర్మాతగా మాత్రమే తనకు తెలుసునని, అంతకుమించి అతడితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

తాను అతను నిర్మించిన ప్రేమ ప్రయాణం చిత్రంలో నటించానని, ఆ తర్వాత తమ మధ్య ప్రేమ చిగురించిందన్నారు. కొద్ది రోజులకు పెళ్లి చేసుకున్నామని చెప్పారు. ఆ తర్వాత అతడు ఎక్కడి నుండి వచ్చాడు, సినీ రంగానికి ఎలా వచ్చాడు అనే అంశాలపై తాను ఏ రోజు అతడిని అడగలేదన్నారు.
తన ఏటీఎం కార్డులు కావాలని ఓ భర్తగా అతడు అడిగాడని, భార్యగా తాను ఇచ్చానని చెప్పారు. తన ఏటీఎం కార్డులను అతను దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. ఈ కేసులో తనను అనవసరంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరినీ మోసం చేయలేదన్నారు. భవిష్యత్తులో తనకు సినిమా అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications