MBBS Seats: రాష్ట్రంలో కొత్తగా 175 మెడికల్ సీట్లు, కాలేజీల వారీగా కొత్త సీట్ల లిస్ట్!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య విద్య విస్తరణలో మరో కీలక ముందడుగు పడింది. జాతీయ వైద్య మండలి (NMC) రాష్ట్రంలోని పిడుగురాళ్ల, విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల 175 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఆమోదం తెలిపింది. వీటితో కలిపి ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా లభించిన సీట్ల సంఖ్య 325కు చేరింది. పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో 100 సీట్లతో ప్రవేశాలు జరిపేందుకు NMC అనుమతినిచ్చింది. అదే విధంగా విజయవాడ ప్రభుత్వ సిద్దార్ధ వైద్య కళాశాలకు అదనంగా 75 సీట్లను మంజూరు చేసింది. ఈ మేరకు NMC ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75, నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 సీట్ల పెంపునకు ఆమోదం తెలిపింది. పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 అదనపు ప్రవేశాలు జరుగనున్నాయి. దీంతో ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే రాష్ట్రానికి ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు లభించినట్లైంది. 2024-25 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 505 సీట్లు అదనంగా లభించాయి. MBBS సీట్లు భారీగా పెరగడంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న నీట్ మెరిట్ విద్యార్థులకు ఊరటనిస్తోoది.

విద్యార్థులకు ఎలా ఉపయోగం?
రాష్ట్రంలో ప్రభుత్వ MBBS సీట్లు పెరగడం వల్ల నీట్‌లో అర్హత సాధించిన మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశ అవకాశాలు మరింత పెరగనున్నాయి. గతంలో కొద్దిపాటి ర్యాంకు తేడాతో ప్రభుత్వ సీటు కోల్పోయిన అనేక మంది పేద విద్యార్థులకు ఇప్పుడు అవకాశం దక్కే పరిస్థితి ఏర్పడుతోంది. ఖరీదైన ప్రైవేట్ వైద్య కళాశాలలను ఆశ్రయించాల్సిన అవసరం ఈమేరకు తగ్గనుంది. పేద విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా వైద్య విద్య అందుబాటులోకి రానుంది. అదనపు ప్రవేశాలతో రాష్ట్రానికి అవసరమైన వైద్యులు అందుబాటులోకొస్తారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2026-27లో సీట్ల పెంపు ఇలా...
- నెల్లూరు-25
- పాడేరు-50
- కడప -75
- విజయవాడ-75
- పిడుగురాళ్ల -100
- మొత్తం-325
2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 505, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 550 అదనపు MBBS ప్రవేశాలకు అనుమతులు లభించాయి. ఎన్ఎంసి నియమాల మేరకు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అదనంగా 50 శాతం సీట్లు గవర్నమెంట్ కోటాలో (కన్వీనర్ కోటా) 275 సీట్లు విద్యార్థులకు దక్కుతాయి. మొత్తంగా...2024-25 నుండి రాష్ట్రానికి 1055 అదనపు మెడిసిన్ సీట్లకు అనుమతులొచ్చాయి. ఈ అదనపు సీట్లతో రాష్ట్రంలో మొత్తం సీట్ల లభ్యత 7,090 కి పెరిగింది. ఇందులో 15 శాతం సీట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో లభించడం విశేషం.












Click it and Unblock the Notifications