సిబిఐ విచారణా లేదు ఏదీ లేదు: బాబు, పావలా ఇస్తే రాసిస్తా: జగన్
హైదరాబాద్: రాజధాని భూముల విషయంలో వైసిపి నేతలు, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ అసత్యాలు చెబుతున్నారని, ఇలాంటి అసత్యాల పైన సిబిఐ విచారణ కాదు.. ఏ విచారణ చేయించేది లేదని, రాజధాని విషయంలో ముందుకు వెళ్తామని సిఎం చంద్రబాబు సభలో చెప్పారు.
మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇంత విచ్చలవిడిగా వ్యవహరించడం ఏమిటన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడటం సభా వ్యవహారమా అన్నారు. ఇది హుందాతనమా అన్నారు. జగన్ బాధ్యతతో ప్రవర్తించాలని, ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నేను రాజధాని విషయంలో చాలా స్పష్టంగా ఉన్నానని చెప్పారు. రాజధాని రాకూడదని మీ ఉద్దేశ్యమని, రైతులకు అన్యాయం జరగాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైసిపికి రాజధాని పైన వ్యతిరేకత ఉందని, పద్ధతి లేని రాజకీయాలు చేస్తున్నారన్నారు.
రాజకీయ ముసుగులో నీచంగా ప్రవర్తిస్తున్నారన్నారు. నన్ను నమ్ముకొని ప్రజలు 34వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు. అలాంటి రైతుల పైన మీరు కుట్ర చేస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి కుట్రదారులు ఉంటే ఈ రాష్ట్రం ఏమవుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఇది నీతిమాలిన రాజకీయమన్నారు.
నేను ప్రజలను కోరుతున్నానని, ఇలాంటి వారు రాజకీయాల్లో ఉంటే, రాజకీయం ముసుగులో దగాలు చేస్తారని ప్రజలు ఆలోచించాలన్నారు. మంత్రుల పైన తీవ్ర ఆరోపణలు చేశారని, వాటిని నిరూపించాలని చంద్రబాబు అన్నారు. ఓ సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుట్రతో చేసే ఆరోపణలు కాబట్టి సిబిఐ విచారణ కాదు.. ఏ విచారణా వేయమన్నారు.

ఆకతాయి నవ్వులు.. : విష్ణు కుమార్
ఇంత సీరియస్ విషయంపై చర్చ జరుగుతుంటే జగన్ ఆకతాయి నవ్వు నవ్వుతున్నారని బిజెపి సభ్యులు విష్ణు కుమార్ రాజు అన్నారు. జగన్ రాజధాని ప్రారంభోత్సవ ఆహ్వాన లేఖ తీసుకోలేదని, ఆయన రాలేదని, ఇది దౌర్భాగ్యమన్నారు. అయినప్పటికీ ఆధారాలు లేని ఆరోపణల పైన ఇంకా చర్చ సరికాదన్నారు. అనవసర ఆరోపణలపై సిబిఐ విచారణ అనవసరమన్నారు. మాట్లాడితే సిబిఐ విచారణ ఏమిటిది అన్నారు.
చంద్రబాబు చేసింది తప్పని అందరికీ తెలుసు: జగన్
రాజధాని విషయంలో చంద్రబాబు తప్పు చేశారని అందరికీ తెలుసునని, కానీ మళ్లీ రాజధాని అంటే మాకు కుట్ర అని ఆరోపణలు చేయడం విడ్డూరమని జగన్ అన్నారు.
మా వాళ్లు భూములు ఇచ్చారని చంద్రబాబు చెబుతున్నారని, అలాంటప్పుడు మేం రాజధానికి వ్యతిరేకం అని ఎలా చెబుతారన్నారు. రాజధాని భూమి విషయంలో సిబిఐ విచారణకు చంద్రబాబు ముందుకు రారని, అందుకే తాను మిగతా విషయాల గురించి మాట్లాడుతానని చెప్పారు.
టిడిపి హామీలపై జగన్ మాట్లాడుతూ... ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చలేదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని తమను విమర్శిస్తున్నారని, కానీ చెప్పినట్లుగా కులాల హామ ఎందుకు నెరవేర్చలేదన్నారు.
ప్రభుత్వ చీఫ్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఉన్న సమస్యను మేం పరిష్కరించుదామనుకుంటే జగన్ దానిని కూడా రాజకీయాలకు వాడుకోవడం విడ్డూరమన్నారు. మంత్రి పల్లె మాట్లాడుతూ.. ఆరోపణలు రుజువు చేస్తే మంత్రులు రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు.
దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. అవాస్తవాల పైన విచారణ చేయించడం ఎందుకని ప్రశ్నించారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. చర్చ తప్పుదారి పట్టిందన్నారు. ఇలాంటి చర్చను ముగించవలసి ఉందని చెప్పారు. ప్రతిపక్ష నేత ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు.
యనమల ప్రకటన అనంతరం చర్చను ముగిస్తున్నట్లు చెప్పారు. 329 నిబంధన ప్రకారం గవర్నర్ ప్రసంగంపై చర్చను ముగిస్తున్నట్లు చెప్పారు. చర్చ ముగించడంపై వైసిపి సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
నేను సవాల్ విసిరా: చంద్రబాబు
నేను రాజధాని భూముల పైన విసిరానని, దానికి జగన్ స్పందించాలని చంద్రబాబు అన్నారు. తనను ఏకవచనంతో సంభోదించడం సరికాదన్నారు. తాము అసైన్డు చట్టాలు ఎక్కడా ఉల్లంఘించలేదని చెప్పారు.
రాజధాని భూములపై విచారణ జరపాలని వైసిపి డిమాండ్ చేసింది. దీనిపై స్పీకర్ కోడెల శివప్రసాద రావు మాట్లాడుతూ.. రాజధాని భూములపై విచారణ జరిపితే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బ తింటుందన్నారు.
పావలా శాతం రాసివ్వండి: జగన్
అంతకుముందు, మంత్రులు జగన్ పైన రూ.43 వేల కోట్ల ఆరోపణలు చేశారు. జగన్ అక్రమాస్తులు రూ.43వేల కోట్లు అని సిబిఐ నిర్ధారించిందన్నారు. దీనిపై జగన్ మాట్లాడుతూ... మంత్రులు తన వద్ద ఉన్నాయని చెబుతున్న 43 వేల కోట్ల రూపాయల్లో పావలా వాటా తనకు ఇస్తే... ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానన్నారు.
విచారణలో జరుగుతున్నది ఒకటి, మంత్రులు ఆరోపిస్తున్నది మరొకటన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు రెండు ఎకరాల ఆసామినని చెప్పుకున్నారని, మరి ఆయన వద్దకు రెండు లక్షల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని జగన్ ప్రశ్నించారు. ఆస్తులపై విచారణ జరగకుండా ఆయన ఎందుకు స్టే తెచ్చుకున్నారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications