కిరణ్‌కు శ్రీధర్ బాబు హెచ్చరిక: ఆనంకు సునిత కౌంటర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన శాఖను మార్చడంపై మంత్రి శ్రీధర్ బాబు బుధవారం మండిపడ్డారు. శ్రీధర్ బాబును శాసన సభ వ్యవహారాల నుండి తప్పించి మరో మంత్రి శైలజానాథ్‌కు అప్పగించారు. దీనిపై తెలంగాణ ప్రాంత మంత్రులు గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీధర్ విలేకరులతో మాట్లాడారు.
తాము సరైన సమయంలో ఏ రీతిలో జవాబు చెప్పాలో ఆ రీతిలో చెబుతామని కిరణ్ కుమార్ రెడ్డిని హెచ్చరించారు. తెలంగాణ విషయంలో తాము రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ ప్రజలను అంత చిన్న వారిగా చూడొద్దన్నారు. తన శాఖ మార్పు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు

కిరణ్ కుమార్ రెడ్డి తన శాఖను మార్చుతూ ఎందుకు నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. తాను వాణిజ్య పన్నుల శాఖను తీసుకోనని చెప్పారు. తాను శాసన సభ వ్యవహారాల మంత్రిగా నిబంధనలకు విరుద్ధంగా పని చేయలేదన్నారు. సక్రమంగా విధులు నిర్వర్తించేందుకు ప్రయత్నించానని చెప్పారు.
ఆలోచించి కిరణ్ నిర్ణయం: ఆనం
మంత్రుల శాఖను మార్చే అధికారం ముఖ్యమంత్రికే ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కిరణ్ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మంత్రి జానా రెడ్డి విమర్శలు చేయకుండా నేరుగా సిఎంతో మాట్లాడితే బాగుండేదన్నారు. ఆనం గవర్నర్ నరసింహన్‌ను రాజ్ భవన్లో కలిశారు.
ఆనంకు సునీతా లక్ష్మారెడ్డి కౌంటర్
శాఖల మార్పు ముఖ్యమంత్రి పరిధిలోని అంశమన్న ఆనంకు తెలంగాణ ప్రాంత మంత్రి సునీతా లక్ష్మా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శాఖల మార్పు సిఎం పరిధిలోని అంశమే అయినా ఈ సమయంలో తీసుకోవడాన్ని తాము తప్పు పడుతున్నామని చెప్పారు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేందుకు అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. తాము ఇవే విషయాలను గవర్నర్ దృష్టికీ తీసుకు వెళ్లామన్నారు. శ్రీధర్ బాబు సమైక్యవాదం బలంగా వినిపిస్తున్నందునే శాఖను మార్చారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications