'అవిశ్వాసం' నేడేనా?: బీజేపీ ఇక తప్పించుకోలేదు.. ఏం జరగబోతోంది?
Recommended Video

న్యూఢిల్లీ: సభ ఆర్డర్‌లో లేదన్న కారణంతో ఇన్నాళ్లు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా పోయింది. టీఆర్ఎస్, అన్నాడీఎంకె పార్టీల ఆందోళనలే ఇందుకు కారణమన్న వాదనలు వినిపించాయి. తాజాగా టీఆర్ఎస్ అవిశ్వాసానికి సహకరించేందుకు ముందుకు రావడంతో.. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చర్చకు ఎవరి అవిశ్వాసం?:
టీడీపీ, వైసీపీలతో పాటు కాంగ్రెస్, సీపీఎం, ఆర్‌ఎస్‌పీలు కూడా అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వడంతో.. బీజేపీ ఇరకాటంలో పడ్డట్టయింది. కనీస మద్దతు సంఖ్యాబలంపై క్లారిటీ రావడంతో.. మంగళవారం అవిశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోక తప్పదు.
అయితే ఎవరి అవిశ్వాసాన్ని స్పీకర్ పరిగణలోకి తీసుకుంటారు? అన్న ప్రశ్నకు.. ముందుగా నోటీసులు ఇచ్చిన వైసీపీ అవిశ్వాసాన్నే లెక్కలోకి తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తప్పించుకోలేని పరిస్థితి?:
సభలో టీఆర్ఎస్, అన్నాడీఎంకె నేతల ఆందోళనలతో గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో ఇన్నాళ్లు అవిశ్వాసాన్ని పక్కనపెట్టేశారు స్పీకర్. ఆందోళనలు విరమించకుంటామని టీఆర్ఎస్ తాజాగా ప్రకటించడంతో.. ఇక ఆ కారణంతో అవిశ్వాసాన్ని పక్కనపెట్టడం కుదరదనే చెప్పాలి.
దానికి తోడు అవిశ్వాసం తెరపైకి వచ్చినప్పుడల్లా.. తప్పించుకోవాలని చూడటం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తుందన్న అంతర్మథనం బీజేపీలో మొదలైంది. అందుకే అవిశ్వాసాన్ని ఎదుర్కొని తమ బలమేంటో చూపించాలని ఆ పార్టీ
భావిస్తోంది.

ఎప్పుడు చర్చ?:
మంగళవారం లేదా బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని గనుక పరిగణలోకి తీసుకుంటే.. ఏప్రిల్ మొదటివారంలో దీనిపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. గురువారం మహవీర్ జయంతి, శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత శని, ఆదివారాలు లోక్‌సభకు వరుసగా సెలవులు కావడంతో.. ఏప్రిల్ మొదటివారంలోనే చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా దీనిపై కచ్చితంగా చర్చ జరుగుతుందని, దానికి ప్రధాని నుంచి జవాబు, ఓటింగు ఉంటాయని ఎన్డీయే వర్గాలు చెబుతున్నాయి.

సహకరిస్తున్న టీఆర్ఎస్..:
తాము వెల్‌లో ఉండడంవల్ల పరోక్షంగా కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నట్లు నెలకొన్న అపోహలను తొలగించేందుకు మంగళవారం నుంచి వెల్‌లో నిరసనలు కొనసాగించబోమని టీఆర్‌ఎస్ సోమవారం ప్రకటించింది. ఇక అన్నాడీఎంకె మాత్రం తమ ఎంపీల నిరసనలు కొనసాగుతాయని, సీఎం చంద్రబాబువి రాజకీయ డ్రామాలు అని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications