బాబు ఆగ్రహం: వెనక్కి తగ్గిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై మరింత ఒత్తిడి
హైదరాబాద్/రాజమండ్రి: పుష్కరాలకు వచ్చి భక్తులకు ప్రయాణభారం తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పుష్కరాలకు వెళ్లే ప్రత్యేక బస్సులో సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని, అధిక ఛార్జీలు వసూలు చేయవద్దని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సుల్లో తెలుగు రాష్ట్రాల ఆర్టీసి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. దీని పైన బిజెపి, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు మండిపడుతున్నాయి. దీంతో ఎట్టకేలకు ఏపి ప్రభుత్వం తగ్గింది.
దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ఆదేశాలతో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు నిర్ణయాన్ని అధికారులు ఉపసంహరించుకున్నారు. ఎవరైనా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి శిద్ధా రాఘవ రావు హెచ్చరించారు.

పుష్కరాలకు అదనపు ఛార్జీలు పెంచేందుకు తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం పైన బిజెపి భగ్గుమంటోంది. బిజెపి నేతలు మాట్లాడుతూ.. హజ్, జెరూసలేం యాత్ర వెళ్లేందుకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు పుష్కరాలకు వెళ్లేందుకు మాత్రం ఛార్జీలు పెంచడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, ఏపీఎస్ఆర్టీసీ పుష్కరాలకు వెళ్లే భక్తులకు అదనపు ఛార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇది తెలంగాణపై ఒత్తిడి అని చెప్పవచ్చు. ఇప్పటికే విపక్షాలు అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏపీ తగ్గించడంతో తెలంగాణపై మరింత ఒత్తిడి పెరిగింది.












Click it and Unblock the Notifications