ఎవరికీ భయపడేది లేదు: ఏపీ జిల్లాల అధ్యక్షులకు పవన్ కళ్యాణ్ నిర్దేశం, ఎన్నికల్లో పోటీపైనా
అమరావతి: జనసేన పార్టీ ప్రజాపక్షం వహిస్తుందని.. ఎవరికీ భయపడేది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అమరావతిలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ తోపాటు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు.
రాష్ట్రంలో ఛిద్రమైపోయిన రహదారుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. శ్రమదానం ద్వారా మరమ్మతులను జనసేన పార్టీ చేపడితే.. ప్రభుత్వం అనుసరించిన పోకడలను ప్రజలందరూ చూశారని తెలిపారు.
సగటు మనిషి అభివృద్ధి, తద్వారా రాష్ట్రాభివృద్ధి అనేది జనసేన పార్టీ లక్ష్యమని పవన్ అన్నారు. మనం ప్రజాపక్షం వహిస్తున్నాం... ఎవరికీ భయపడేది లేదని జనసేన శ్రేణులకు స్పష్టం చేశారు. ఏ అంశాన్నైనా ప్రజా కోణంలోనే విశ్లేషించి వారికి అండగా నిలుద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
ప్రతి జిల్లాలో పర్యటనకు షెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నామని పవన్ చెప్పారు. జిల్లాకు వెళ్ళినప్పుడే అక్కడ పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షలు నిర్వహిస్తానని తెలిపారు. పార్టీ శ్రేణులను జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం అనుసంధానం చేస్తూ ముందుకు సాగుదామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

నిర్దేశిత ప్రణాళిక ప్రకారం జిల్లా కార్యవర్గ సమావేశంలో చర్చించాలని తెలిపారు. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను ప్రభావవంతంగా నిర్వహించాలన్నారు. త్వరలో మండలాధ్యక్షులు, కమిటీల నియామకం ఉంటుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలో జరగబోయే మున్పిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అభ్యర్ధులను బరిలోకి నిలపాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు తెలిపారు.
మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు చిరు, పవన్
మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాదులో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మెగా సోదరుల రాకతో పెళ్లి వేదిక వద్ద కోలాహలం నెలకొంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వధూవరులకు ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.












Click it and Unblock the Notifications