ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు దక్కని ఊరట-వచ్చే నెల 3 వరకూ ఆగాల్సిందే.. !
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో వాడీవేడీగా వాదనలు సాగాయి. చంద్రబాబు నుంచి సమాచారం రాబట్టాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దంటూ సీఐడీ చేసిన వాదనను తప్పుబడుతూ ఆయన లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రాజకీయ దురుద్దేశంతో వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని లూథ్రా వాదించారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు లబ్ది చేకూర్చేందుకే ఆయన భూముల పక్కగా రింగ్ రోడ్డు వెళ్లేలా అలైన్ మెంట్ లో మార్పులు చేసిందని సీఐడీ న్యాయవాదులు వాదించారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. దీనిపై లూథ్రా అభ్యంతరం తెలిపారు.

గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ద్వారా వైసీపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు వేయించిందని, సీఐడీ విచారణలో కావాల్సిన పత్రాలు సీఆర్పీసీ సెక్షన్ 91 ద్వారా నోటీసు జారీ చేసి తీసుకునే అవకాశం ఉన్నా అరెస్టులకు ప్రయత్నిస్తోందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో హైకోర్టు ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్నాక దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అప్పటివరకూ అంటే అక్టోబర్ 3 వరకూ ఈ కేసు విచారణను వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications