ఉద్యోగాల భర్తీలో సంస్కరణలు : ప్రిలిమ్స్..ఇంటర్వ్యూ రద్దు : వయోపరిమితి పొడిగింపు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో ఏపీ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా.. నిరుద్యోగులు నష్టపోయే నిబంధనలు తొలగించాలని నిర్ణయించింది. గ్రూప్ 1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలు రద్దు చేసింది. డిజిటల్ మూల్యాంకనం చేపట్టనుంది. ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాలతో పాటుగా..రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ పోస్టులు - ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కోటా అమలు తదితరాలు ఇందులో ఉన్నాయి. టీడీపీ సర్కారు గ్రూప్ 1తో పాటు అన్ని కేటగిరీల పోస్టులకూ ప్రిలిమ్స్‌ను తప్పనిసరి చేసింది.

నియామకాల్లో తాజా నిర్ణయాలు
గతంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా దాన్ని రద్దు చేసి 1:15 ప్రకారం మార్చింది. దీని వలన నష్టం జరుగుతుందనే అభిప్రాయం ఉంది. దీంతో..ఇప్పుడు 1: 50 నిష్పత్తిని తిరిగి ప్రవేశపెట్టింది. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్‌లో ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించారు.
దీనివల్ల అభ్యర్థులందరికీ ఒకేసారి ప్రశ్నపత్రం అందడంతో పాటు లీకేజ్ లాంటి వాటికి ఆస్కారం లేకుండా చేశారు. అవకతవకలను నివారించేందుకు ఏపీపీఎస్సీ డిజిటల్ మూల్యాంకనాన్ని చేపట్టింది. దీనివల్ల పారదర్శకతతో పాటు అర్హులైన వారికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్టుమెంట్ పరీక్షల్లో గత సర్కారు నెగిటివ్ మార్కులు ప్రవేశపెట్టడంతో పదోన్నతులు, ఇతర ప్రయోజనాల కోసం పరీక్షలు రాసే ఉద్యోగులు నష్టపోయారు.

నెగటివ్ మార్కులు రద్దు
దీన్ని రద్దు చేయాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఆలకించలేదు. దీంతో.. ఇప్పుడు డిపార్టుమెంట్ పరీక్షలలో నెగిటివ్ మార్కులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి నిబంధనల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కల్పిస్తున్న ఐదేళ్ల సడలింపును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వర్గాలకు కల్పిస్తున్న సడలింపు కాలపరిమితి 2021 మే నెలతో ముగిసింది. కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో ఈ అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా వయోపరిమితి సడలింపును 2026 మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది.

ఈడ బ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు
రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు రిజర్వేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకున్నా మెరిట్‌లో అగ్రస్థానంలో ఉంటే ఓపెన్ కేటగిరీ పోస్టులకు అర్హులుగా నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడ బ్ల్యూఎస్) ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోటాను రిజర్వు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2018లో చట్టం తెచ్చింది. ఇప్పుడు, ఏపీ ప్రభుత్వం ఆయా వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం కోటా అమలుకు చర్యలు తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఏపీపీఎస్సీ ఆమేరకు చర్యలు చేపట్టింది.

కొత్త నియామకాల్లో తప్పని సరి చేస్తూ
కొత్త నోటిఫికేషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థుల వివరాలను పొందుపర్చేలా వీలు కల్పించింది. ఏపీలోకరోనా కారణంగా ఆర్దిక పరిస్థితులు ఇబ్బందిగా ఉండటంతో..కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదని.. త్వరలోనే శాఖల వారీగా ఖాళీలను ప్రకటిస్తూ..ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. నోటిఫికేషన్లు జారీ చేసే సమయానికి అవసరమైన విధంగా సంస్కరణలను తీసుకొస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.